ఈ ప్రశ్నలకు బదులుందా చంద్రబాబు గారూ?

Chandrababu Naidu to do repairs to Kuppam

చాలామందికి గుర్తుండే ఉంటుంది….ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “నా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అందరూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. జాతీయస్థాయిలో అవార్డులు తెచ్చుకున్నారు, కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన మంత్రులు, అధికారులు జైళ్లకు వెళ్తున్నారు” అంటూ హేళనగా మాట్లాడేవారు.

Chandrababu instead of these questions?
Chandrababu instead of these questions?

మరి ఇవాళ ఏమి జరుగుతున్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారు. ఆయన పాలనలో జరిగిన అవినీతి అంత ఇంతా కాదని లోకం మొత్తం కోడై కూస్తున్నది. చంద్రబాబు దగ్గర మంత్రులుగా పని చేసిన కొందరు నాయకులు అవినీతి, కుంభకోణాలు, భూదోపిడీలు, హత్యలు మొదలైన కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఒక తెలుగుదేశం నాయకుడిని హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని పోలీసులకు దొరక్కుండా పారిపోతూ చివరకు పట్టుబడ్డారు. మరొక సచివుడు ఏకంగా కార్మికుల సొమ్ముని కాజేశారనే ఆరోపణలతో మూడు నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టారు. మాజీ లోక్ సభ సభ్యుడు జెసి దివాకర రెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర రెడ్డి లెక్కలేనన్ని కేసుల్లో జైళ్లకు వెళ్లడమే కాక అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో వ్యాపారాలు సైతం మూసేసుకోవాల్సి వచ్చింది. ఇక చంద్రబాబు కాలంలో మైనింగ్ వ్యాపారాల్లో అనేక అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు పన్నులు ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేశారనే ఆరోపణలతో అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ తన మైనింగ్ వ్యాపారానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పారట! ఇంకా మాజీ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ మొదలైన మహానుభావులు కుంభకోణాల ఆరోపణల్లో ఉన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కుంభకోణాల్లో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. తమ కుంభకోణాలు ఎక్కడ బయటకు వస్తాయోనని చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

వీటన్నికి పరాకాష్ట భూమా అఖిలప్రియ ఉదంతం. చంద్రబాబు మంత్రివర్గంలో ఒక వెలుగు వెలిగిన మంత్రిణి అఖిలప్రియ పొరుగురాష్ట్రం వెళ్లి అక్కడ ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయబోయి పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యారు. ఆమె గూర్చి ఒక్క మాట మాట్లాడానికి కూడా చంద్రబాబు, లోకేష్ నాయుడు గజగజ వణికిపోతున్నారు. కేసీఆర్ కు ఆగ్రహం తెప్పిస్తే చేతులకు సంకెళ్లు పడతాయని నోళ్లకు సీళ్లు వేసుకుని కూర్చున్నారు. గతంలో అచ్చెన్నను, జెసి బ్రదర్స్ ను వెళ్లి పరామర్శించిన లోకేష్ నాయుడు నేడు హైదరాబాద్ పేరే ఎత్తడం లేదు!

ఇక చంద్రబబు హయాంలో చక్రాలు తిప్పిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేడు అందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మాజీ డిజిపి ఆర్పీ ఠాకూర్ నేడు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఇక పోలీస్ శాఖ నేనే అన్ని విర్రవీగిన మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వర రావు సస్పెన్షనుకు గురై, ఉద్యోగం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ, అక్కడ కూడా మొట్టికాయలు వేయించుకుంటూ, రేపో మాపో తనకు అరెస్ట్ తప్పదని వణుకుతున్నారు! చంద్రబాబు అండ చూసుకుని హద్దులు మీరి వ్యవహరించి సాటి ఐపీఎస్ అధికారులతో ఉమ్మేయించుకుని, చీత్కారానికి గురై దిక్కుతోచని పక్షిలా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు!

మరి చంద్రబాబు వీటికి సమాధానం చెబుతారో లేదో?

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు