చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉప ఎన్నిక జరగాల్సి వుంది. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్, కరోనా కారణంగా మృత్యువాతపడ్డంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ, పొలిటికల్ హీట్ అయితే పెరిగిపోయింది. వైసీపీ, దాదాపుగా తాము బరిలోకి దింపనున్న అభ్యర్థిని ఖరారు చేసేసింది. గ్రౌండ్ లెవల్‌లో వైసీపీ పని మొదలయ్యింది కూడా. బీజేపీ – జనసేన మాత్రం ఎవర్ని బరిలోకి దింపాలన్న విషయమై మల్లగుల్లాలు పడుతున్నాయి. మరి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాటేమిటి.?
అందరికన్నా ముందు.. అయినా అదే గందరగోళం
మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పేశారు. అయితే, ఇంతవరకు పనబాక లక్ష్మి మీడియా ముందుకు రాలేదు. ఆమె బీజేపీలో చేరాలనుకుంటున్న సమయంలో, చంద్రబాబు తెలివిగా ఆమెను ‘లాక్’ చేయడానికే, తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. అయితే, అభ్యర్థిగా ప్రకటించినంతమాత్రాన పనబాక లక్ష్మి, టీడీపీలో కొనసాగే అవకాశం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారట.
సొంత జిల్లాలో రాజకీయాల్ని చక్కబెట్టలేకపోతున్న చంద్రబాబు
తిరుపతి, చిత్తూరు జిల్లాలోనే వుంది.. ఆ లెక్కన, చంద్రబాబు సొంత జిల్లా అది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు జిల్లాకి చెందిన పలు అసెంబ్లీ నియోజకవర్గాలూ వున్నాయనుకోండి.. అది వేరే సంగతి. అయినాగానీ, సొంత జిల్లాలో రాజకీయాల్ని చక్కబెట్టుకోలేకపోతున్నారన్న విమర్శ చంద్రబాబు మీద చాలా గట్టిగా వినిపిస్తోంది. అసలు పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి వుందా.? అని టీడీపీ శ్రేణులే, తాజా పరిణామాల పట్ల ఆందోళన చెందుతుండడం గమనార్హం.