Brain Stroke: ఒక్క నిమిషం ఆలస్యం ప్రాణానికే ప్రమాదం.. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇవే..!

ఇటీవలి కాలంలో ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అనేకమంది బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలిపోతున్నారు. ఉదయం ఆఫీస్ పనిలో ఉన్నవారు, సాయంత్రం ఇంట్లో విశ్రాంతిగా కూర్చున్నవారు, రోడ్డు మీద ప్రయాణిస్తున్నవారు.. ఎవరిదైనా ఒక్కసారిగా చేతి కాళ్లు కదలకపోవడం, మాట తడబడటం, చూపు మసకబారడం, ముఖం వంకరగా మారడం వంటి లక్షణాలు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చేస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ విలువైన కొన్ని నిమిషాలను చాలా మంది కోల్పోతున్నారు. అదే ఈ కొద్దిసేపు ఆలస్యం ప్రాణాంతకంగా మారుతోంది.

బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక్కసారిగా మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే ప్రమాదకర స్థితి. మెదడులోని ఏ భాగానికి రక్తసరఫరా నిలిచిపోతుందో, ఆ భాగం నియంత్రించే అవయవాలు వెంటనే పని చేయడం మానేస్తాయి. దీంతో ఒకవైపు చేయి, కాలు మొద్దుబారి పడిపోవడం, మాట పూర్తిగా ఆగిపోవడం, ఒక్కసారిగా చూపు పోవడం, నిలబడలేని స్థాయిలో తల తిరగడం వంటి లక్షణాలు క్షణాల్లోనే కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాల్లో మందుగా ఉన్న బిపి, అదుపు తప్పిన షుగర్, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యం, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, గుండె జబ్బులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు కొందరిలో హార్మోన్ మాత్రల వినియోగం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పట్టణ జీవనశైలిలో ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్, నిద్రలేమి ఈ స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతున్నాయి.

వైద్యుల ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలుగా వస్తుంది. ఎక్కువ మందిలో రక్తం గడ్డకట్టి మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఇస్కేమిక్ స్ట్రోక్ వస్తుంది. కొందరిలో మెదడులో రక్తనాళాలు పగిలిపోవడం వల్ల హెమరాజిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఈ రెండు పరిస్థితుల్లోనూ సమయం అత్యంత కీలకం. స్ట్రోక్ వచ్చిన తొలి కొన్ని నిమిషాలే బాధితుడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

బ్రెయిన్ స్ట్రోక్‌లో అత్యంత కీలకమైన సమయాన్ని వైద్యులు ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. మొదటి నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల్లోపు బాధితుడికి క్లాట్ కరిగించే ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చికిత్స అందితే 30 నుంచి 50 శాతం వరకు పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు పెద్ద రక్తనాళంలో గడ్డ ఉన్నప్పుడు అత్యాధునిక థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా ఆ గడ్డను తొలగించి ప్రాణాలు నిలబెట్టే అవకాశం కూడా ఉంది. కానీ ఇవన్నీ సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడే సాధ్యం.

అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపించిన క్షణాల్లోనే బాధితుడిని ఆలస్యం లేకుండా స్ట్రోక్ రెడీ హాస్పిటల్‌కు తరలించడం అత్యంత కీలకం. ఎమర్జెన్సీ సేవలు, సిటి స్కాన్, ఎంఆర్ఐ, న్యూరాలజిస్టు, ఇంటర్వెన్షనల్ వైద్య సేవలు అన్నీ ఒకేచోట ఉండే ఆసుపత్రుల్లో చికిత్స వేగంగా ప్రారంభమవుతుంది. ఒక్కో నిమిషం ఆలస్యం వేలాది మెదడు కణాలకు నష్టం చేసే ప్రమాదం ఉండటంతో సమయాన్ని వృథా చేయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

స్ట్రోక్ రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. ఉప్పు పరిమాణం తగ్గించడం, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, సిగరెట్లకు పూర్తిగా దూరంగా ఉండటం, రోజూ కొద్దిసేపైనా నడక లేదా వ్యాయామం చేయడం, బిపి, షుగర్, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలాగే వారంలో కనీసం ఒకసారి చేపల ఆహారం, తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ముందే హెచ్చరిక ఇచ్చే ప్రమాదం.. లక్షణాలు కనిపించిన క్షణాల్లో స్పందిస్తే ప్రాణం కూడా మిగులుతుంది, జీవితం కూడా మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది.