తాను మునిగింది సరిపోక, జనసేన పార్టీని కూడా నిండా ముంచేస్తోంది భారతీయ జనతా పార్టీ. ‘జాతీయ నాయకత్వం మనకి తగిన గౌరవం ఇస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో కొన్ని సమస్యలున్నాయి..’ అంటూ మిత్రపక్షం బీజేపీపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు.. ఇలా కీలకమైన అంశాలు, వీటితోపాటు కొన్ని విభజన చట్టంలోని కీలక అంశాలపై రాష్ట్ర బీజేపీకి సరైన అవగాహన లేదు. కేంద్రంలోని బీజేపీ మాత్రం ఖచ్చితమైన అభిప్రాయంతో వుంది.
ఆ అభిప్రాయమేంటంటే, ‘రాష్ట్రం మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తాం.. కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన చిత్తశుద్ధి చూపించబోం..’ అన్నది. ఇదెక్కడి వాదన.? అని చాలామంది ముక్కున వేలేసుకున్నాసరే.. బీజేపీది ఇదే నినాదం. రాష్ట్రాన్ని ఇలా ఉద్దరించేశామని బీజేపీ చెప్పడం, విధిలేని పరిస్థితుల్లో బీజేపీకి జనసేనాని పవన్ కళ్యాన్ వంత పాడటం చూస్తూనే వున్నాం. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలో ఒకటిగా ఎదగాల్సిన జనసేన, ఎదుగూ బొదుగూ లేకుండా పోతోంది. విశాఖ ఉక్కు కర్మగారం ప్రైవేటీకరణ వ్యవహారంలో జనసేన పార్టీ గనుక ఛాన్స్ తీసుకుని, కేంద్రంపై పోరాటం చేయగలిగితే.. రాష్ట్ర రాజకీయాల్లో అదో పెను సంచలనమవుతుంది. జనసేన తప్ప, ఏ రాజకీయ పార్టీ కూడా ఏపీలో విశాఖ ఉక్కుపై పోరాటం చేసేందుకు నైతిక హక్కుని కలిగి లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ హయాంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బీజం పడిందని బీజేపీ అంటోంది. టీడీపీ, వైసీపీ కూడా ఇదే మాట అంటున్నాయి. వైసీపీ – టీడీపీ మధ్య పరస్పర విమర్శలు మామూలే. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీ ‘విష కౌగిలి’ నుంచి బయటకు రావాలన్నది జనసైనికుల్లో కొందరి ఆలోచన. కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ లెక్కలు వేరేలా వున్నాయి. ఆ లెక్కలకు ఎంత తిక్క వుందన్నది మాత్రం జనసైనికులకీ అర్థం కావడంలేదు. ఈ గందరగోళంలోనే బీజేపీతోపాటు జనసేన కూడా నిండా మునిగిపోతోందన్నమాట.