తెలంగాణాలో దూకుడు పెంచిన బీజేపీ

bjp-increasing-speed-up-in-telangana
ఒకప్పుడు ఉప ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉత్సాహం ఉరకలు వేస్తుండేది.  దమ్ముంటే ఎన్నికలకు పోదాం రా అని సవాళ్లు విసురుతుండేది.  అధికారం చేపట్టిన గత ఆరేళ్లలో ఏ ఒక్క ఉపఎన్నికలోనూ టీఆరెస్ కు ఎదురు లేదు.  కానీ మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నిక మొదటిసారిగా టీఆరెస్ లో కూడా భయాన్ని కలిగించింది.  ఎందుకంటే ఆల్రెడీ తమ సిట్టింగ్ స్థానం అయిన దుబ్బాకలో సునాయాసంగా సాధించాల్సిన విజయాన్ని హరీష్ రావు నియోజకవర్గంలో ఇరవైనాలుగు గంటలు పర్యటిస్తూ కూడా కోల్పోవడం టీఆరెస్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.  
bjp-increasing-speed-up-in-telangana
bjp-increasing-speed-up-in-telangana
 
ప్రత్యేక రాష్ట్రంకోసం పదమూడేళ్ళ మహోద్యమాన్ని నడిపి, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆరెస్ అంటే ఉద్యమపార్టీ అనే బలమైన ముద్ర ఉన్నది.  ఉద్యమపార్టీ అంటే తెలంగాణ ప్రజలకు పూనకం వచ్చేంతగా టీఆరెస్ జనం మనస్సులో నిలిచిపోయింది.  కనీసం పదిహేనేళ్లపాటు తమకు తిరుగుండదని భావించింది.  ఊహించనివిధంగా దుబ్బాకలో ఎదురైన పరాజయం టీఆరెస్ పార్టీని అంతర్మథనంలో పడేసింది.  రాష్ట్రం వచ్చి ఏడేళ్లు కూడా నిండకుండానే ప్రజలకు దూరం అవుతున్నదన్న సంకేతాలు ఎందుకు వెలువడ్డాయి అన్న ప్రశ్నకు టీఆరెస్ అగ్రనేతలు జవాబు ఇవ్వలేకపోతున్నారు.  దొరలపాలన, గడీల పాలన, కుటుంబపాలన అంటూ  ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజలలోకి వెళ్తున్నదా అని టీఆరెస్ సందేహిస్తున్నది.  గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఓడిపోయిన తన కుమార్తె కవితను ఎమ్మెల్సీగా దొడ్డిదోవన చట్టసభకు కేసీఆర్  పంపడాన్ని మేధావులు సైతం విమర్శిస్తున్నారు.  ఇప్పటికే కుటుంబం నుంచి ఒకరు ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఉండగా ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఉద్యమం కోసం పనిచేసిన నాయకుడు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని టీఆరెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు.  కుటుంబపాలను ప్రజలు అంగీకరించడం లేదని దుబ్బాక ఎన్నిక అనంతరం టీఆరెస్ నాయకులు చర్చించుకున్నారు.  
 
ఇగ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా వికటిస్తున్నాయి.  కాంగ్రెస్ బలహీనపడుతున్న  మాట వాస్తవమే కావచ్చు.  కానీ ఆ మేరకు బీజేపీ బలపడుతున్నదన్న అంచనా వెయ్యకపోవడాన్ని కొందరు టీఆరెస్ నేతలు తప్పుపడుతున్నారు.  కాంగ్రెస్ నుంచి ఎవరైనా గెలిచినప్పటికీ సమయం వచ్చినపుడు వారు టీఆరెస్ లో చేరిపోవడానికి వెనుకాడరు.  కానీ, బీజేపీ నుంచి సర్పంచ్ గెలిచినా టీఆరెస్ లోకి వెళ్ళరు.  ఎందుకంటే వారికి కేంద్రంలో సుస్థిరమైన అధికారం ఉన్నది.  బీజేపీని అలక్ష్యం చేసి పొరపాటు చేశామా అని ఇప్పుడు టీఆరెస్ నేతలు చింతిస్తున్నారు.  
 
అన్నిటికన్నా ప్రధానంగా ఉద్యమపార్టీ పేరు పెట్టుకుని ఓడిపోవడాన్ని చూస్తుంటే ఉద్యమం నాటి భావోద్వేగాలు ప్రజల్లో తగ్గిపోతున్నాయా అనే సందేహం కలుగుతున్నది అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పుడు టీఆరెస్ అనేది ఉద్యమ పార్టీ కాదని, రాజకీయపార్టీ అని పార్టీ అధినేత కేసీఆర్ చాలాకాలం క్రితమే ప్రకటించారు.  అన్ని పార్టీలవారు, ప్రజలు కలిసి పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇక ఇప్పుడు టీఆరెస్ కూడా అన్ని పార్టీల లెక్కేనని, సరిగా పాలిస్తే గెలిపిస్తాం, లేకపోతె ఓడిస్తాం అనే భావం ప్రజల్లో ఏర్పడుతున్నదని వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో రేపు ఒకటో తారీకు జరిగే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తో పోటీ కొంచెం టఫ్ గానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.  బీజేపీకి భయపడే ముఖ్యమంత్రి గత నాలుగైదు రోజుల్లో అనేక వరాలను కురిపించారని, లేకపోతె పట్టించుకునేవారు కారని నమ్మేవారు ఎక్కువయ్యారు.  ఈ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ లభించి కార్పొరేషన్ కైవసం చేసుకుంటేనే టీఆరెస్ పరువు నిలబడుతుంది.  ఎక్స్ అఫిషియో సభ్యులబలంతో కలిపి మేయర్ పదవిని చేపడితే టీఆరెస్ పరువు పోయినట్లే భావించాలి.  ఉద్యమకాలం నాటి ఉద్వేగాలు కనుమరుగు అవుతున్నట్లు నమ్మాల్సివస్తుంది.  ఒకవేళ బీజేపీ ఓడిపోతే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు.  ఎందుకంటే దానిమీద తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి సెంటిమెంట్ లేదు.