విడాకుల వెనుక అసలు కారణం ఇదే.. గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పారు..!

ఒకప్పుడు పెళ్లి అంటే జీవితాంతం నిలిచే బంధం, రెండు మనసుల కలయిక అని భావించేవారు. కానీ కాలం మారింది. నేటి తరం పెళ్లిని చాలా సార్లు తాత్కాలిక సంబంధంగా మాత్రమే చూస్తోంది. ఫలితంగా విడాకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎందుకిలా జరుగుతోంది? అనే ప్రశ్నకు సమాధానం 5000 ఏళ్ల క్రితం భగవద్గీతలోనే ఉన్నదని గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు చెప్పిన సైకాలజీ లెసన్స్ ఈ రోజు కూడా మ్యారేజ్ లైఫ్‌లో అద్భుతంగా వర్తిస్తున్నాయి.

భగవద్గీత రెండవ అధ్యాయం 62వ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన మాటలు నేటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి. ఏదైనా విషయంపై ఎక్కువగా ఆలోచిస్తే దానిపై అటాచ్‌మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్‌మెంట్ నుంచి కోరిక పుడుతుంది. కోరిక తీరనప్పుడు కోపం వస్తుంది. ఈ కోపమే చివరికి బుద్ధిని చెడగొట్టి, సంబంధాల పునాది కూల్చేస్తుంది. నేటి భార్యాభర్తల మధ్య జరిగే గొడవల వెనుక ఇదే కారణం కనిపిస్తోంది. ఎమోషనల్ సపోర్ట్ కావాలి, రొమాన్స్ కావాలి, డబ్బు సెక్యూరిటీ కావాలి, టైమ్ కావాలి… ఇలా ప్రతి ఒక్కరి అంచనాలు నెరవేరనప్పుడు చిరాకు మొదలవుతుంది. ఆ చిరాకు నుంచి గొడవలు, అపార్థాలు, చివరికి విడాకులు వస్తాయి.

కృష్ణుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం అహంకారం. యుద్ధ భూమిలో చెప్పిన గీత బోధన ఇళ్లలో జరిగే గొడవలకూ సరిగ్గా వర్తిస్తుంది. భార్యాభర్తల మధ్య “నేనే కరెక్ట్, నా మాటే చివరి” అనే పంతం ఉంటే ఆ బంధం నిలవదు. ఈ అహమే పెళ్లిని నాశనం చేస్తుంది. దీన్ని అరికట్టడానికి గీత ఇచ్చిన సొల్యూషన్ “నిష్కామ కర్మ” – ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం, ఒకరిపై ఒకరు బాధ్యత తీసుకోవడం. అప్పుడే పెళ్లి నిజమైన అర్థంలో నిలుస్తుంది.

విష్ణుపురాణం వంటి గ్రంథాలు కలియుగం గురించి ముందే చెప్పాయి. ఈ యుగంలో పెళ్లిళ్లు వీక్ అవుతాయని, బంధాలు నిజాయితీ కంటే డబ్బు, స్వార్థం, అబద్ధాలపై ఎక్కువ ఆధారపడతాయని పేర్కొన్నాయి. ఇవే నేటి కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామందికి పెళ్లి అంటే సినిమాల్లా రొమాంటిక్ ఫాంటసీ. కానీ రియాలిటీ ఆ ఫాంటసీకి సరిపోకపోతే తట్టుకోలేక విడాకుల దారి పడుతున్నారు.

అయితే గీత పరిష్కారాలు కూడా ఇచ్చింది. గృహస్థాశ్రమం అంటే కేవలం ఎంజాయ్‌మెంట్ కాదు. అది ఇద్దరూ కలిసి ఎదగడానికి ఒక దశ. కృష్ణుడు చెప్పిన కొన్ని సింపుల్ సూత్రాలు పాటిస్తే సంబంధం నిలుస్తుంది. పార్ట్‌నర్‌ను ప్రేమించాలి కానీ అతిగా ఆశించకూడదు. కోపం, బాధలు, సంతోషాలు అన్నీ శాశ్వతం కావని తెలుసుకోవాలి. చివరగా, ఒకరికి ఒకరు చేసిన సేవను లెక్క పెట్టకుండా ప్రతిఫలం ఆశించని ప్రేమతో ముందుకు సాగాలి. మొత్తానికి, 5000 ఏళ్ల క్రితం చెప్పిన శ్రీకృష్ణుడి గీత బోధనలు నేటి మ్యారేజ్ లైఫ్‌కూ పర్ఫెక్ట్‌గా సరిపోతున్నాయి. భర్తా–భార్యలు ఈ లెసన్స్‌ను అర్థం చేసుకుంటేనే సంబంధాలు నిలుస్తాయి. లేకపోతే పెళ్లి కూడా కేవలం షార్ట్‌టర్మ్ డీల్‌లా మారిపోతుంది.