రోజూ ఉదయాన్నే కరివేపాకు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..!

మన రోజువారీ జీవితంలో చిన్నపాటి మార్పులు చేస్తే.. అవి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో ఎప్పుడూ ఉండే కరివేపాకు కూడా అలాంటి అద్భుతమే చేస్తుంది. సాధారణంగా రుచి, వాసన కోసం వేసే కరివేపాకును చాలామంది తినకుండా పక్కన పెట్టేస్తారు. కానీ ఉదయాన్నే ఖాళీ పొట్టతో కొన్ని కరివేపాకులు నమిలి తింటే.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇది మొదట్లో కాస్త చేదుగా అనిపించినా, రాన్రానూ అలవాటు అయి శరీరానికి మంచి చేస్తుందంట. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి ఇది సహజ వైద్యం లాంటిది. కరివేపాకుల్లో ఉన్న విటమిన్ C, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ జుట్టు మూలాలను బలపరుస్తాయి. ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు తాగి, కొన్ని నిమిషాల తర్వాత నాలుగైదు కరివేపాకులు నమలాలి. అలా చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.

అలాగే ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఖాళీ పొట్టతో కరివేపాకు తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్ సక్రమంగా పనిచేస్తాయి, మలబద్ధకం, మూత్ర సమస్యలు తగ్గుతాయి. ఉదయం లేవగానే వచ్చే బద్ధకం, వికారం వంటి సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారికి కరివేపాకు సహజంగా సహాయ పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కంటిచూపు మెరుగుపరచడంలోనూ ఇవి అద్భుతం చేస్తాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లల ఆహారంలో కరివేపాకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.. అది వారికంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ చిన్న అలవాటు వేసుకుంటే… జుట్టు నుంచి కంటిచూపు వరకు ఆరోగ్యం సహజంగా మెరుగవుతుంది.