Balti Movie Review: ‘బాల్టీ’ మూవీ రివ్యూ! వడ్డీ కబడ్డీల ఆట మిస్ మ్యాచ్!

రచన- దర్శకత్వం : ఉన్ని శివలింగం
తారాగణం : షేన్ నిగమ్, శాంతనూ భాగ్యరాజ్, ప్రీతీ అస్రానీ, పూర్ణిమా ఇంద్రజిత్, ఆల్ఫాన్స్ పుదిరేన్, సెల్వరాఘవన్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్,

చాయాగ్రహణం : అలెక్స్ పులిక్కల్
బ్యానర్స్ : ఎస్టీకే ఫిలిమ్స్, బినూ జార్జి అలెగ్జాండర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : సంతోష్ కురువిల్లా, బినూ జార్జి అలెగ్జాండర్

గత నెల మలయాళ తమిళ భాషల్లో విడుదలైన ‘బాల్టీ’ ఈవారం తెలుగులోనూ విడుదలైంది. దీన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రచారం చేశారు. దీనికి ఉన్ని శివలింగం కొత్త దర్శకుడు. హీరో షేన్ నిగమ్ నటించిన 25 వ సినిమా ఇది. అలాగే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ గా నటించాడు. కబడ్డీని లోకల్ మాఫియా కథతో కలిపి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సిద్ధం చేశామని చెప్పిన కొత్త దర్శకుడి ప్రయత్నం ఏ మేరకు ఫలించిందో చూద్దాం…

కథేమిటి?

తమిళనాడు- కేరళ సరిహద్దులో వేలం పాళయం పట్టణంలో ముగ్గురు లోన్ మాఫియాలు చీడ పురుగుల్లా వుంటారు. చక్రవడ్డీలకి చక్రవడ్డీలువేసి ప్రజల్ని చిత్ర హింసలు పెట్టి వసూలు చేస్తూంటారు. ఇక్కడే ఉదయన్, కుమార్, సురేష్, మణి అనే చురుకైన కబడ్డీ ఆటగాళ్ళు ఎదురు లేకుండా వుంటారు. కబడ్డీలో వీళ్ళ మెరుపు వేగానానికి ఇంకే జట్టూ గెలవలేని పరిస్థితిలో వుంటుంది. లోన్ మాఫియా భైరవన్ జట్టు వీళ్ళతో ఎప్పుడూ గెలవదు. సోడా బాబు, గౌరీ అనే మరో ఇద్దరు లోన్ మఫియాలతో భైరవన్ కి వైరం వుంటుంది. సోడాబాబు సోడా ఫ్యాక్టరీ ముసుగులో స్మగ్లింగ్ కూడా చేస్తూంటాడు. ఒకప్పుడు వేశ్య అయిన గౌరీ వడ్డీలతో పేద స్త్రీలని దోపిడీ చేస్తూంటుంది. ఈ ముగ్గురు మాఫియాల ఆగడాలతో పట్టణం ఎప్పుడూ అల్లకల్లోలంగా వుంటుంది.

Mutton Soup Movie Review: ‘మటన్ సూప్’ రివ్యూ అండ్ రేటింగ్

Constable Movie Review: ఈసారి కూడా వరుణ్ సందేశ్…. ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ!

ఇలా వుండగా, ఉదయన్ టీం ఒక వీధి పోరాటంలో కనబరిచిన తెగువ, పోరాటంలో వాడిన నైపుణ్యమూ గమనించిన భైరవన్, ఉదయన్ టీం ని డబ్బుతో లోబర్చుకుని, లోన్ రికవరీ ఏజెంట్లుగా నియమించుకుంటాడు. ఇప్పుడు ఈ టీం లోన్లు రికవరీ చేస్తూ దౌర్జన్యాలు మొదలెడతారు.

భైరవన్ ప్రదీప్ అనే వాడికి లక్ష రూపాయలు అప్పు ఇచ్చి వుంటాడు. దీనికి జంబో వడ్డీ పేరుతో 10 లక్షలు కలిపి మొత్తం 11 లక్షలు ఇవ్వాలని కట్టేసి హింసిస్తూంటాడు. తను ప్రేమిస్తున్న కావేరీకి ఈ ప్రదీప్ అన్న అవుతాడని తెలుసుకున్న ఉదయన్, హింసని అడ్డుకునేప్పుడు చేయి వెళ్ళి భైరవన్ కి తగలడంతో, నన్నే కొడతావాని ఉదయన్ మీద పగబడతాడు. దీంతో భైరవన్ కీ ఉదయాన్ టీం కీ శత్రుత్వం మొదలైపోతుంది. ఈ శత్రుత్వం ఏ పరిణామాలకి దారి తీసిందన్నది మిగతా కథ

ఎలా వుంది కథ.

ప్రచారం చేసినట్టుగా ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కాదు. స్పోర్ట్స్ కథగా మొదలై మాఫియా యాక్షన్ డ్రామాగా మారిపోయే కథ. దీంతో అటు కబడ్డీకీ, ఇటు వడ్డీల దోపిడీలకీ న్యాయం చేయలేకపోయింది. పెద్ద నగరంలో గాక చిన్న పట్టణంలో ఈ ఎత్తున లోన్ మాఫియాలు వుండడం విడ్డూరమే. దీనికి ఉదయన్ మిత్రుడు కూడా బాధితుడే. అయితే ఈ వడ్డీ కబడ్డీల కథ ఒక కథగా గాక రెండు కథలుగా విడిపోవడంతో సమస్యలో పడింది.

ఉదయన్ టీం ని భైరవన్ లోన్ రికవరీ ఏజెంట్లుగా వాడుకోవాలనుకోవడం దగ్గరే కథ దారి తప్పింది. తిరుగులేని క్రీడా కారులు కూడా తమ క్రీడాసక్తిని బలిపెడుతూ మాఫియాతో చేతులు కలపడమేమిటి? భైరవన్ చేస్తే క్రీడాకారుల్ని ఉపయోగించుకుని పెద్ద క్రీడా వ్యాపారం చేసుకోవచ్చు. తనకెలాగూ రికవరీ ఏజెంట్లు వున్నారు. లోన్లు తీసుకుంటున్నది పెద్ద నగరాల్లో ఘరానా వ్యక్తులు కూడా కారు. అదే చిన్న పట్టణంలో బడుగు జీవులు. వీళ్ళని పీడించి వసూళ్ళు బాగానే చేస్తున్నారు. ఇలా క్రీడలతో కబడ్డీ టీంకి ఎదగాలన్న ఆశయం, కబడ్డీతో భైరవన్ కి వ్యాపార లక్ష్యమూ లేని అసహజ పాత్ర చిత్రణల వల్ల ఈ కథ ఏమిటోగా మారిపోయింది కొత్త దర్శకుడితో. చేస్తే కబడ్డీ ఆటగాళ్ళు పట్టణానికి మాఫియాల పీడా వదిలిలించాలేమో గానీ, తమని కబడ్డీ వీరులుగా అభిమానిస్తున్న ప్రజలనే లోన్ రికవరీ ఏజెంట్లుగా మారిపోయి పీడించడం దగ్గర బ్యాడ్ టేస్ట్ గా మారిపోయింది కథనం.

అయితే ఉదయన్, భైరవన్ మీద చేసుకున్నాడన్న కాన్ఫ్లిక్ట్ ఫస్టాఫ్ లో రాదు, ఇంటర్వెల్లో కూడా వుండదు. ఇంటర్వెల్ వరకూ కబడ్డీ కథ, లోన్ మాఫియాల ఆగడాలు, ఉదయన్ టీం రికవరీ ఏజెంట్లుగా చేసే హంగామా, ఇంటర్వెల్లో ఓ యాక్షన్ సీను -వీటితో గడిచిపోతుంది ఫస్టాఫ్ కథ ఎస్టాబ్లిష్ కాకుండా.

సెకండాఫ్ లో ఉదయన్ చేయి చేసుకోవడంతో అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడి, భైరవన్ ప్రతీకార కథగా మారిపోతుంది. ఫస్టాఫ్ కబడ్డీ కథతో సెకండాఫ్ తెగిపోయి- మాఫియాల కథ వచ్చి అతకడంతో సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడింది సినిమా! ఇక ఇక్కడ్నుంచీ భైరవన్ తో బాటు మరో ఇద్దరు మాఫియలతో చీటికీ మాటికీ విసుగు పుట్టేలా యాక్షన్ సీన్స్ వచ్చేస్తూంటాయి. చివరికి పూర్తి శత్రు సంహారం జరిగి దయతలిచి ముగుస్తుంది రెండున్నర గంటల సినిమా! ఇంతకీ బాల్టీ అంటే మెరుపు వేగం. కబడ్డీలో ఉపయోగపడే నైపుణ్యం. దీన్ని కథకి కూడా ఉపయోగించుకుని వుంటే బావుండేది.

ప్రజల్ని పీడిస్తున్న లోన్ మాఫియాల్ని కబడ్డీ నుపయోగించుకుని అంతమొందించే కథగా ఇది వుండి వుంటే- ప్రచారం చేసినట్టుగా ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అన్పించుకునేది!

ఎవరెలా చేశారు?

హీరో ఉదయన్ గా షేన్ నిగం వృత్తి కబడ్డీ క్రీడాకారుడుగా మాత్రం పాత్రలో లీనమైపోతూ నటించాడు. మాఫియాలతో పోరాటాలు కూడా కబడ్డీ ట్రిక్స్ తోనే మెరుపు వేగంతో చేయడం పాత్రని హైలైట్ చేసింది. మిగతా బృందం కూడా ఇదే యాక్షన్ కొరియోగ్రఫీలో భాగమయ్యారు. యాక్షన్ సీన్లు వదిలేస్తే కథా పరంగా పొసగని పాత్రలు ఇవి. ఇంకో పొసగని పాత్ర హీరోయిన్ ప్రీతీ అస్రానీ. ఈమె ఎప్పుడూ మూతి ముడుచుకుని వుంటుంది.

విలన్ గా నటించిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, ప్రేమగా మాట్లాడి కడుపులో తన్నే విలనిజాన్ని తనదైన శైలిలో నటించుకుపోయాడు. సోడా బాబుగా నటించిన మరో దర్శకుడు ఆల్ఫోన్స్ పుదిరేన్, గౌరీగా పూర్ణిమా ఇంద్రజిత్ మాఫియా పాత్రలకి రూరల్ టచ్ ఇచ్చేప్రయత్నం చేశారు.

మాఫియా పాత్రలకి న్, దర్శకుడు, అతని స్క్రీన్ ప్ప్రెజెన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పాటలు, బిజిఎం ఫర్వాలేదన్పించేలా వున్నాయి. సినిమాటోగ్రాఫర్ అలెక్స్ పులిక్కర్ కబడ్డీ సహా మిగతా యాక్షన్ కోరియోగ్రఫీని మల్టిపుల్ యాంగిల్స్ లో కవర్ చేస్తూ షాట్స్ తీశాడు. దీనికి ఎడిటర్ శివకుమార్ ఎడిటింగ్, సందోష్ -విక్కీల యాక్షన్ కోరియోగ్రఫీ విజువల్ గ్రామర్ ని అద్భుతంగా పోషించాయి.

పైన చెప్పుకున్నట్టు స్క్రీన్ ప్లే మధ్యకి ముక్కలవడంతో, రెండు కథల విడివిడి కథనాలు కావడంతో బలి అయింది ఎమోషనల్ డ్రైవ్. భావోద్వేగ రహితంగా ఫ్లాట్ గా కథనం మారడంతో ఫైట్లు, కబడ్డీ పట్లు కూడా ఈ సినిమాని నిలబెట్టడం సమస్య అయికూర్చుంది.

రేటింగ్ : 2 / 5

KS Prasad: Vijay Thalapathy TVK Party Strategy | Pawan Kalyan | Telugu Rajyam