Constable Movie Review: ఈసారి కూడా వరుణ్ సందేశ్…. ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం : ఆర్యన్ సుభాన్ ఎస్ కే
తారాగణం : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్ తదితరులు
సంగీతం : సుభాష్ ఆనంద్, గ్యాని, చాయాగ్రహణం : షైక్ హజారా
నిర్మాత : బలగం జగదీష్
విడుదల : అక్టోబర్ 10. 2025

వరుణ్ సందేశ్ కెరీర్ డోలాయమానంగా ఉంటున్నది తెలిసిందే. అయినా ఆఫర్లు వస్తూనే వున్నాయి, నటిస్తూనే వున్నాడు. ఎన్ని నటించినా ఇంతే సంగతులు అన్నట్టు వుంతోందే తప్ప ఒక్క హిట్టు రావడం లేదు. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తూ ప్రేక్షకుల ముందు కొచ్చాడు.ఈ సారి కానిస్టేబుల్’ అనే మూవీ. దీనికి ఆర్యన్ సుభాన్ అనే కొత్త దర్శకుడు. దీన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్రచారం చేశారు.దీని విశేషాలేమిటో ఈ కింద రివ్యూలో చూద్దాం…

కథేమిటి?
అది శంకరపల్లి అనే గ్రామం. అక్కడ వరుసగా దారుణ హత్యలు జరుగుతూంటాయి. ఈ హత్యలు పోలీసులకి సవాలుగా మారుతాయి. చంపుతున్నది హంతకుడా, హంతకురాలా, లేక హంతకుల బృందమా క్లూస్ దొరకవు. అక్కడి పోలీస్ స్టేషన్ లో కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్ గా పనిచేస్తూంటాడు. ఇతను ఈ హత్యల క్రమం తన మేన కోడలు కీర్తి (నిత్యశ్రీ) వరకూ రావడంతో ఎలర్ట్ అవుతాడు. దీంతో తనే ఇన్వెస్టిగేషన్ లో దూకుతాడు. కొందర్ని అనుమానిస్తాడు.వాళ్ళు కూడా హత్యకి గురవుతూంటారు. ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? పట్టుకోవడానికి కాశీ ఎలాటి ప్రయత్నాలు చేసి సఫలమయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ?
ఇది సస్పెన్స్ థ్రిల్లర్ ల ట్రెండ్. ఈ ట్రెండ్ లో విఫలమవుతున్నవే ఎక్కువ. వేఎతిని ప్రొఫెషనల్ గా తీయకపోవడం వాళ్ళ ఈ పరిస్థితి. ప్రస్తుత కథ కూడా ఇంతే. సస్పెన్స్ కోసం ఈ కథకి అనుకున్న మెయిన్ పాయింటుని రివీల్ చేయడం లేదు. ఈ పాయింటు బావుంది. ఇన్వెస్టిగేషన్ బలహీనంగా వున్నా మెయిన్ పాయింటు వల్ల ఈ సస్పెన్స్ థ్రిల్లర్ భిన్నంగా కనిపిస్తుంది. కథలోవచ్చే మలుపులూ థ్రిల్ చేస్తాయి. కథకి ఒక మెసేజ్ ని కూడా జోడించారు. అయితే కథ జరిగే రూరల్ నేపథ్యాన్ని ఇంకా బాగా చూపించి వుంటే కథకి బలం వచ్చేది. ఈ నేపథ్యాన్ని కొన్ని సీన్ల వరకూ ఎస్టాబ్లిష్ చేసి వదిలేశారు. అలాగే కథకి అవసరం లేని సన్నివేశాలతో కథనాన్ని బలహీన పరచారు. ఉదాహరణకి ఫస్టాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్ పూర్తిగా అనవసరం!

అంతేగాక ఇన్వెస్టిగేషన్ లో లాజిక్ మిస్ చేసి హాస్యాస్పదం చేసిన సీన్లు వున్నాయి. మూగవాడితో సీను, చెరువులో గొలుసు దొరికే సీను వగైరా. ఇన్వెస్టిగేషన్ లో ప్రొఫెషనలిజం లోపిస్తే ఈ రోజుల్లో ఆకట్టుకునే అవకాశం లేదు. వీటిని మించిన స్థాయిలో వెబ్ సిరీస్ వస్తున్నాయి. కనీసం వెబ్ సిరీస్ ని చూసి అయినా సస్పెన్స్ థ్రిల్లర్స్ తీస్తే బావుంటుంది.

ఎవరెలా చేశారు?
కానిస్టేబుల్ గా వరుణ్ సందేశ్ ది బలహీన పాసివ్ పాత్ర. సరైన గోల్, దాంతో వ్యూహం కనిపించవు. సెకండాఫ్లో బోరు కొట్టేయడం మొదలవుతుంది. ఇలా ఇంకెన్నాళ్ళు సినిమాలు చేస్తాడు తను? ఇలా సినిమాలు చేసి ఏమిటి లాభం? యాక్షన్ పార్ట్ వరకు ఫరవా లేదు.

హీరోయిన్ మధులిక గ్లామరస్ గా వుంది గానీ అనవసర పాత్రగా మిగిలిపోయింది. ఆమె చేసేదేమీ వుండదు. ఇక విలన్ గురించి సస్పెన్స్ కోసం చెప్పుకోకుండా వదిలేద్దాం. ఇతర పాత్రలు చెప్పుకో దగ్గవి కావు.

సాంకేతికంగా బలహీనంగా వుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ వగైరా బడ్జెట్ ని కుదించి చేస్తే వచ్చిన ఫలితం లాగా ఉన్నాయి. కొత్త దర్శకుడు సుభాన్ మంచి పాయింటుతో కథ అనుకున్నాడు గానీ, తెర కేక్కించడంలో విఫలమయ్యాడు. కథనంలో కొన్ని మలుపులు, కొన్ని యాక్షన్ సీన్లు ఉన్నంత బలంగా మిగతా కథ కూడా ఉండేలా శ్రద్ధ తీసుకుని వుంటే వరుణ్ సందేశ్ ని ఈసారైనా నిలబెట్టే అవకాశముండేది. సికిందర్ రేపు ఎర్లీ మార్నింగ్ బల్టీ రివ్యూ వస్తుంది.

రేటింగ్ : 2/5

BJP Only Focus Mithun Reddy, But Why Suddenly | Sri Ram | Jagan | Telugu Rajyam