లేస్తే మనిషి కాడు.. అన్నది పాత ముతక ప్రస్తావన. నందమూరి బాలక్రిష్ణ కూడా అంతేనేమో.! ఆయనకు ఆవేశమొచ్చింది.. ‘లెజెండ్’ సినిమా తరహాలో పొలిటికల్ హడావిడి మొదలెట్టేశారు. సొంత నియోజకవర్గం ఆయనకు గుర్తుకొచ్చేసింది.. బస్తీ మే సవాల్.. అంటూ అధికార పార్టీ మీద నాలుగు కామెంట్లు వేసేశారు.. నాలుగు పొలిటికల్ ముచ్చట్లు చెప్పారు.. కొన్ని మంత్రాలు కూడా చదివేశారు. ఏంటో బాలయ్య.. ఆ హంగామా ఏంటో ఆయన అభిమానులకీ అర్థం కాదు. సరే, ఆ విషయం పక్కన పెడితే, మంత్రి కొడాలి నాని మీద ఎమ్మెల్యే బాలయ్య గుస్సా అయ్యారు. గుడివాడలో పేకాట క్లబ్బుల వ్యవహారంపై స్పందించిన బాలయ్య, ‘పేకాట ఆడి, అరెస్టయితే.. జరీమానా కట్టి మళ్ళీ ఆడుకుంటారని మంత్రి అనడమేంటి.?’ అంటూ తెగ ఆవేశపడిపోయారు. అంతే తప్ప, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై కొడాలి నాని చేసిన విమర్శల గురించి బాలయ్య అంత సీరియస్‌గా స్పందించలేకపోయారు. చంద్రబాబు, బాలయ్యకి బావ..
అలాగే వియ్యంకుడు కూడా. అయినాగానీ, చంద్రబాబుని నాని తిడుతున్న వైనం గురించి బాలయ్య పెద్దగా పట్టించుకోలేదు. మేం తలచుకుంటే.. అంటూ సాగదీసిన బాలయ్య, అంతకు మించి గట్టిగా కొడాలి నానికి అల్టిమేటం జారీ చేయలేకపోయిన వైనం టీడీపీ శ్రేణులకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇక, చంద్రబాబుపైన విరుచుకుపడిపోయే కొడాలి నాని, బాలయ్య మీదా అలా విరుచుకుపడతాడా.? పవన్ కళ్యాణ్ మీద ‘షకీలా సాబ్’ అనేసిన కొడాలి నాని, బాలయ్యకు కూడా అలాంటి పేరేదన్నా పెట్టే ధైర్యం చెయ్యగలరా.? ఏమోగానీ, నందమూరి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని రాజకీయం చేసే కొడాలి నాని, బాలయ్యను మాత్రం ఏమీ అనబోరని, అంత సాహసం చేయరనీ.. నందమూరి సినీ అభిమానులు అంటున్నారు. ఒకవేళ కొడాలి నాని, అంత రిస్క్ చేసేస్తే దబిడి దిబిడే.. అని బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించేస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ, బాలయ్యకు వున్నపళంగా హిందూపురం నియోజకవర్గం ఎందుకు గుర్తుకొచ్చిందట. ఏమో, ఆయనకే తెలియాలి.