హిమాలయ పర్వతాల ఒడిలో.. సముద్ర మట్టానికి 10,200 అడుగుల ఎత్తులో కొలువై ఉన్న పవిత్ర బద్రీనాథ్ ధామ్, హిందువుల ఆధ్యాత్మిక యాత్రలో అత్యున్నత స్థానం పొందింన. చార్ ధామ్ యాత్రలో తప్పనిసరిగా సందర్శించే ఈ క్షేత్రం కేవలం భక్తిశ్రద్ధలకే కాకుండా, ఎన్నో రహస్యాలతో కూడిన అద్భుత ప్రదేశంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రకృతి ప్రవర్తించే తీరు, జంతువుల నడవడిక చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవకుండా ఉండలేరు.
శ్రీమహావిష్ణువు ఇక్కడ “బద్రీ” చెట్టు కింద ఘోరమైన తపస్సు చేశారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ ప్రాంతానికి “బద్రీనాథ్” అనే పేరు వచ్చింది. ఆలయంలోని స్వామివారి విగ్రహం శాలిగ్రామ శిల నుంచి సహజంగా ఏర్పడినదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ విష్ణుమూర్తి పద్మాసనంలో గాఢమైన ధ్యాన ముద్రలో దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయం. భక్తుల నమ్మకంలో, ఆ ధ్యానం భంగం కలగకుండా ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా మెలగుతుందని చెబుతారు.
ఆ నిశ్శబ్దాన్ని నిరూపించే మూడు వింతలు తరతరాలుగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొదటిది పట్టణంలో కుక్కలు ఉన్నా అవి ఎప్పుడూ మొరగవు. రెండోది తుఫానుల సమయంలో ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి కానీ, వాటి తర్వాత ఎప్పుడూ ఉరుము వినిపించదు. మూడోది వర్షం పడినా, సాధారణంగా వాన జల్లు శబ్దం వినిపించదు. ఈ మూడు సంఘటనలు సహజ నియమాలకు విరుద్ధమైనట్లే కనిపిస్తాయి. కానీ స్థానికులు మరియు భక్తులు మాత్రం వీటిని దైవ సంకేతాలు గా భావిస్తారు.
ఇదీ చదవండి: కలలో పాములు ఇలా భయపెడుతున్నాయా.. అయితే మీ జీవితంలో ఆ కష్టాలు తప్పవు ..!
ప్రకృతి కూడా ఇక్కడ స్వామి ధ్యానాన్ని గౌరవిస్తూ నిశ్శబ్దంగా ఉంటుందని స్థానిక పండితులు చెబుతారు. అందుకే భక్తులు కూడా బద్రీనాథ్ ధామ్‌లోకి ప్రవేశించే సమయంలో మౌనం, భక్తిశ్రద్ధలను పాటించడం పవిత్ర కర్తవ్యంగా భావిస్తారు. కేవలం రహస్యాలు మాత్రమే కాదు, ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా అద్భుతమే. సాంప్రదాయ గర్వాలీ శైలిలో, రంగురంగుల ముఖద్వారంతో కనిపించే ఈ ఆలయం హిమాలయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ.
మంచుకొండల మధ్య, పక్కనే అలకనంద నది ప్రవహిస్తూ ఉండగా, వెనుక నీలకంఠ పర్వతం అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. శతాబ్దాలుగా భూకంపాలు, మంచు తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడిన ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాదు, నిర్మాణ కళకు కూడా ప్రతీకగా నిలుస్తోంది. బద్రీనాథ్ ధామ్ సందర్శించే యాత్రికుల మాటల్లో చెప్పాలంటే ఇక్కడి గాలి కూడా వేరేలా ఉంటుంది, మనసు తెలియకుండానే ప్రశాంతంగా మారుతుంది. ఇది నిజంగానే భూమిపై ఒక దైవిక ప్రదేశం.
