ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ: ఒక్క ఎకరా.. వర్సెస్ 150 ఎకరాలు.!

ఎక్కడ ఏ భూమి అమ్మితే ఎంత వస్తుంది.? రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.? అసలు ఈ అంశం చుట్టూ అధికారంలో వున్న పార్టీలు చర్చిస్తే ఎలా.? పైగా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. మంత్రి స్థాయి వ్యక్తులు భూములు, రేట్లు.. అమ్మకాల గురించి.. అదీ పొరుగు రాష్ట్రాల ప్రస్తావన తేవడం సబబేనా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ‘తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే, ఆంధ్రప్రదేశ్‌లో పది పదిహేను ఎకరాల భూమి కొనవచ్చు..’ అంటున్నారు. గతంలో, ‘ఏపీలో ఎకరం భూమి అమ్మితే, తెలంగాణలో ఐదారు ఎకరాల భూమి కొనొచ్చు..’ అనే వాదన వుండేది.

భూముల ధరలు తెలంగాణలో పెరిగాయనీ, దానికి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే కారణమని చెప్పాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఉద్దేశ్యం. గతంలో, ఏపీలోని అధికార పార్టీ (టీడీపీ.. అప్పట్లో) కూడా నినదించింది.

కానీ, పరిస్థితులు తారుమారయ్యాయి. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి, ఆంధ్రప్రదేశ్‌లో భూముల ధరలు గణనీయంగా తగ్గిపోయాయి.. ఇదైతే ఓపెన్ సీక్రెట్. కారణం, ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని లేకపోవడమే.!

రాజధాని అనే కాదు, చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయి. అయితే, ఈ విషయమై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాదన ఆశ్చర్యకరంగా వుంది. ‘ఏపీలో ఎకరం భూమి అమ్మితే, తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు..’ అంటూ సెలవిచ్చారు గుడివాడ అమర్నాథ్.

కౌంటర్ ఎటాక్ అనుకుంటే ఫర్లేదుగానీ.. జనం ఫక్కున నవ్విపోతున్నారన్న విషయాన్ని అధికార వైసీపీ గుర్తెరగకపోతే ఎలా.?