Paritala Sunitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయిందని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చెరువుకు జలహారతి.. పర్యటనలో భాగంగా కక్కలపల్లి గ్రామానికి చేరుకున్న పరిటాల సునీత, అక్కడి గ్రామస్తులతో కలిసి గ్రామ చెరువుకు ‘జలహారతి’ ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువులు నిండుకుండలా మారడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

మారుమూల గ్రామాలకూ నీరు.. ఈ సందర్భంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం నీరు అందుతోందని అన్నారు. ఆయన ప్రత్యేక కృషితోనే నేడు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయని, ఫలితంగా రైతులు, గ్రామ ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఆయన దార్శనికతతోనే గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని పరిటాల సునీత పేర్కొన్నారు.

