ఏపీ భారతీయ జనతా పార్టీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి, త్వరలో రాజకీయం వెడెక్కనుంది, ఒక ముందు చూస్తారు బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలు. ఇవీ గత కొన్నిరోజులుగా వినిపిస్తున్న మాటలు. బీజేపీ నేతలు కూడా ఇవే చెబుతూ వస్తున్నారు. కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజుగారు బాద్యతలు చేపట్టిన రోజు నుండి బీజేపీలో కొంత హడావుడి పెరిగిన మాటైతే వాస్తవమే కానీ ఆ హడావుడి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేదే తేలని ప్రశ్న. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన సందర్భంలో సోము వీర్రాజుగారు 2024లో అధికారంలోకి వచ్చేస్తామని సునాయాసంగా చెప్పేశారు. అప్పుడే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అధికారం సంగతి తర్వాత.. ముందు పార్టీని నిలబెట్టండి అన్నట్టు సెటైరికల్ కామెంట్స్ చేశారు.
అప్పుడు తగ్గిన వీర్రాజుగారు రానున్న రోజుల్లో తామే ప్రతిపక్షం అని సర్దుకున్నారు ఇక పార్టీ వ్యవహారాల పరంగా సోముగారు విధానాలను మార్చుకున్నారు. తాము అమరావతికి అనుకూలమే కానీ రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం పరిధిలో ఉండదని మెలిక పెట్టి చేతులు దులిపేసుకున్నారు. అప్పటివరకు కేంద్రం ఏదో విధంగా మూడు రాజధానుల విధానాన్ని అడ్డుకుంటుంది అనుకున్న రైతులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇక కొత్త అధ్యక్షుడిగా కొన్నిరోజులు టీవీ ఛానెళ్ళలో ఇంటర్వ్యూలు ఇచ్చిన సోము వీర్రాజుగారు తమకు అధికారం చేపట్టడం పెద్ద పనికాదన్నట్టు మాట్లాడారు. రెండు కళ్లుగా ఉన్న వైసీపీ, టీడీపీలను పొడిచేసి తాము మూడో కన్ను తెరుస్తామని అన్నారు. మరి ఆ పొడవడం, తెరవడం ఎలాగో వివరించలేదు. ప్రజెంట్ బీజేపీ గురి మొత్తం టీడీపీ మీదే ఉంది. ఎలాగైనా తెలుగుదేశాన్ని బద్నాం చేసి ద్వితీయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారు.
కానీ అదంత సులభం కాదని వారికీ తెలుసు. అయినా ఏదో ట్రై చేస్తున్నారు. అసలు రాష్ట్రం కష్టాల్లో ఉండటానికి కారణం చంద్రబాబు గత పాలనేనని అంటున్నారు. బాబుగారు రాష్ట్రం మొత్తాన్ని పార్టీ నేతలకు దోచిపెట్టారని, చంద్రబాబులాంటి దుష్ట రాజకీయ నేత మరొకరు ఉండరని అంటున్నారు. ఇన్ని మాట్లాడుతున్న ఆయన 2014 నుండి నాలుగేళ్ల పాటు టీడీపీతో అంటకాగింది తామేనన్న సంగతిని మరచినట్టున్నారు. ఇంకా మాట్లాడితే రాష్ట్రం ఇలా రాజధాని లేని దుస్థితిలో ఉండటానికి బీజేపీ కూడా ఒక కారణం. ఆనాడు రాజధాని పనుల్ని ఎలా చేస్తున్నారని చంద్రబాబును సమీక్షించలేదు. భూసేకరణ, భవనాల నిర్మాణం ఎలా జరుగుతున్నాయో ఆరాతీసే ప్రయత్నమే చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఆమాత్రం బాధ్యత మనకూ ఉందని అనుకోలేదు.
అలాంటివారు టీడీపీదే తప్పంతా అన్నట్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం. రాష్ట్రం విడిపోయాక ప్రత్యేక హోదా అవసరం అన్నది, ఇస్తామన్నది వారే. కానీ ఇప్పుడు హోదా ఇచ్చే ప్రసక్తే లేదంటూ మాట మార్చింది వారే. ఇక చివరిలో ఇస్తామన్న ప్యాకేజీని ఏమేరకు విడుదల చేస్తున్నారో చెప్పడం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుండి ప్రోత్సాహకాల అందాల్సిన స్థాయిలో అందలేదనేది కాదనలేని వాస్తవం. వాటన్నింటినీ రాష్ట్రం తరపున ఏనాడూ ప్రశ్నించి ఎరుగరు కమలనాథులు. ఒక విధంగా చూస్తే రాష్ట్రం అభివృద్ది పరంగా వెనకబడటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాన కారణం. బీజేపీ వైఖరి చూస్తే రాజకీయపరమైన లక్ష్యాలే తప్ప ప్రజా శ్రేయస్సు అసలు వారి అజెండాలో లేనే లేదని అర్థమవుతోంది.
ఇన్ని మాటలు మాట్లాడుతున్న వీర్రాజుగారు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద వారి స్టాండ్ ఏమిటనేది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేదు. ప్రజా సమస్యలకు తమదైన పరిష్కారాలు చెప్పలేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ఏర్పాటు చేసుకోలేదు. ఈ విషయమై జనసేన క్కార్యకర్తల్లో కూడ అసహనం ఉంది. చేసే ప్రతి పనిని ఓ పథకం ప్రకారమే చేస్తున్నామనే వీర్రాజుగారు ఆ పథకం ఏమిటని ఎవరైనా అడిగితే అవన్నీ మీకు చెప్పి చేయాలా అంటారే తప్ప కనీసం వారి కార్యకర్తలకు కూడ వాటిని చెప్పరు. మళ్లీ తమపై ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు ఇస్తుంటారు. కొన్ని రోజులుగా వీర్రాజుగారి సారథ్యాన జరుగుతున్న ఈ హడావుడిని చూస్తున్న జనం అసలు మీ మీద ఎవరికీ అన్ని అంచనాలు, ఆశలు లేవు, పవన్ అనే వ్యక్తే మీ వెనక లేకపోతే మిమ్మల్ని పట్టించుకుంటారా. అసలు ఇన్ని బిల్డప్స్ ఎందుకు బాబాయ్.. ముందు మీకంటూ రాష్ట్రంలో సొంత ఇమేజ్ ఏర్పరుచుకోండి చాలు అంటున్నారు.