ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయ్. సోమవారం (నవంబర్ 30) నుంచి ఐదు రోజులపాటు (అంటే డిసెంబర్ 5 వరకు) అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. శీతాకాల సమావేశాల్లో హీటెక్కించే అంశాలు చాలానే చర్చకు వస్తాయి. మూడు రాజధానులు, స్థానిక ఎన్నికలు, హిందూ దేవాలయాలపై దాడులు.. ఇలా చాలా అంశాలపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం జరగబోతోందన్నది నిర్వివాదాంశం. అంతేనా, ఇంకా చాలా విశేషాలుంటాయ్.
ఇంతకీ, ఈసారి ఎన్ని వికెట్లు పడతాయ్.?
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే, ఆ సమయంలో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి అధికార పార్టీ వ్యూహరచన చేయడం మామూలే. ఈసారి జరగబోయే సమావేశాలకు ముందే, టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చే ఆలోచనలో వుందట అధికార వైసీపీ. ఓ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీతో తాజాగా టచ్‌లోకి వచ్చారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఈ తరహా రాజకీయ వ్యవహారాలతో ప్రతిపక్షం డిఫెన్స్‌లో పడిపోతుంది.
మూడు రాజధానులపై చర్చకు వైసీపీ రెడీ..
మూడు రాజధానుల అంశానికి సంబంధించి వైసీపీ చాలా కాన్ఫిడెంట్‌గా వుందన్నది ఓపెన్ సీక్రెట్. పైగా, అసెంబ్లీలో టీడీపీ బలం చాలా చాలా తక్కువ. దాంతో, టీడీపీ నుంచి దూసుకొచ్చే ఒకటీ రెండూ ప్రశ్నలకు అదే స్థాయిలో సమాధానం చెప్పడం వైసీపీకి కష్టమేమీ కాదు. మూడు రాజధానుల ఎపిసోడ్‌లో టీడీపీని దోషిగా నిలబెట్టేందుకు వైసీపీ, అసెంబ్లీని వేదికగా చేసుకోవడం ఖాయమే.
స్థానిక పోరు మాటేమిటి.?
స్థానిక ఎన్నికల్ని ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశ్యం వైసీపీకి లేదు. అయినాసరే, ఆ విషయమై చర్చ జరిగితే, టీడీపీకి ఎలా సమాధానం చెప్పాలో వైసీపీకి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో టీడీపీ ముందు బాయ్ కాట్ తప్ప ఇంకో ఆప్షన్ వుండదన్నది నిర్వివాదాంశం. హిందూ దేవాలయాలపై దాడుల వ్యవహారంపైనా టీడీపీ వాయిస్, అసెంబ్లీలో డైల్యూట్ అయిపోవడం ఖాయం.