గబ్బిలం.. చీకటి పడగానే ఆకాశంలో వేగంగా దూసుకెళ్లే ఈ పక్షి.. పగలు వెలుగులో మాత్రం గుహల్లో, చెట్ల కొమ్మలపై తలక్రిందులుగా వేలాడుతూ కనిపిస్తుంది. పక్షిలా ఎగురుతూనే, పక్షి కాదనే విచిత్ర లక్షణం దీనికి ఉంది. వెన్నెముక కలిగిన ఏకైక ఎగిరే క్షీరదంగా గబ్బిలం ప్రకృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసే ప్రశ్న ఒక్కటే.. ఇవి ఎందుకు తలక్రిందులుగా వేలాడుతాయి.. నేలపై నిలబడి పక్షుల్లా ఎందుకు ఎగరలేవు.. దీనికి సమాదానం ఈ కథనంలో తెలుసుకుందాం.
గబ్బిలాల శరీర నిర్మాణమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. వీటి కాళ్లు చాలా సున్నితమైనవి. నిలబడేలా శరీర బరువును మోయగలిగే శక్తి వాటికి ఉండదు. అందుకే గబ్బిలాలు నేలపై నిటారుగా నిలబడలేవు. పక్షులు నేలపై నుంచి ఎగరాలంటే కాళ్లతో నెట్టే బలం, రెక్కల బలం రెండూ ఉపయోగిస్తాయి. కానీ గబ్బిలాలకు ఆ అవకాశం లేదు. అందుకే ఇవి ఎత్తైన ప్రదేశాల్లో తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాయి. అక్కడి నుంచి కిందకు జారుతూ రెక్కలు విప్పితే చాలు.. క్షణాల్లోనే గాల్లోకి దూసుకెళ్తాయి. ఇది వాటికి సహజమైన, సురక్షితమైన టేకాఫ్ విధానం.
తలక్రిందులుగా వేలాడటం వల్ల మరో లాభం కూడా ఉంది. నేలపై ఉండే శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. పైగా చీకటి గుహల్లో లేదా చెట్ల కొమ్మల మధ్య వేలాడితే వాటిని గుర్తించడం శత్రువులకు అంత సులభం కాదు. ఇలా వేలాడే సమయంలో గబ్బిలాల పాదాలు స్వయంచాలకంగా కొమ్మలను బలంగా పట్టుకుంటాయి. ప్రత్యేకంగా కండరాలకు శ్రమ లేకుండానే పట్టుబలం ఉండేలా వాటి పాద నిర్మాణం ఉంటుంది. అందుకే నిద్రలో ఉన్నా అవి కింద పడిపోవు.
గబ్బిలాల మరో అద్భుత శక్తి వాటి శబ్దం. కళ్లు ఉన్నప్పటికీ, చీకటిలో దారి కనుక్కోవడానికి అవి అల్ట్రాసోనిక్ శబ్దాలను ఉపయోగిస్తాయి. ఎగురుతూ ముందుకు పంపే శబ్ద తరంగాలు ఎదురున్న వస్తువులను తాకి తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రతిధ్వనిని బట్టి దూరం, దిశను అంచనా వేస్తాయి. ఈ ఎకోలోకేషన్ వల్లనే అంధకారంలో కూడా అడ్డంకులు తప్పించుకుని వేగంగా ప్రయాణించగలుగుతాయి.
గబ్బిలాల ప్రపంచంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. గబ్బిలాల ముఖం నక్కను పోలి ఉండటంతో వాటిని ఎగిరే నక్కలు అని పిలుస్తారు. ఎగురుతున్న సమయంలో వీటి గుండె వేగం నిమిషానికి వెయ్యి సార్ల వరకు కొట్టుకుంటుంది. అలాగే గబ్బిలాల విసర్జన అయిన గ్వానోను అత్యంత పోషక విలువలున్న సహజ ఎరువుగా రైతులు ఉపయోగిస్తారు.
అయితే గబ్బిలాల విషయంలో జాగ్రత్త అవసరం. అరుదుగా అయినా గబ్బిలాలు కరిస్తే రేబిస్ వంటి వైరస్‌ల ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని తాకకుండా, దూరంగా ఉండటమే మంచిది. భయంకరంగా కనిపించినా, ప్రకృతి సమతుల్యతకు గబ్బిలాలు ఎంతో అవసరమైన జీవులు. చీకటిలో తలక్రిందులుగా వేలాడే ఈ చిన్న జీవిలో ఇంత అద్భుతమైన శాస్త్రం దాగి ఉందన్నది నిజంగా ఆశ్చర్యమే.
