భారత్‌పై ఉగ్రదాడులకు వేదికగా మారిన పాకిస్థాన్ ఇప్పుడు మరో షాకింగ్ ప్రకటనతో చర్చల్లో నిలిచింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన కేంద్రాలపై భారత వైమానిక దళాలు మే 7న భారీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మృతి చెందారు. వారందరూ ఉగ్రవాద సంబంధాలు కలిగినవారేనని సమాచారం.
ఇందుకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన కొత్త వివాదానికి తెరలేపింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన పాక్, అసలు ఉద్దేశం ఏమిటన్న చర్చ మొదలైంది. మసూద్ అజార్‌కు బంధువులుగా మృతి చెందిన 14 మందికి తాను వారసుడిగా ఉండడంతో, మొత్తం రూ.14 కోట్లు నేరుగా అతనికే చెల్లించబోతున్నట్టు అర్థమవుతోంది. అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన వ్యక్తికి ప్రభుత్వం నేరుగా నష్టపరిహారం చెల్లించనుందన్నది చింతించాల్సిన అంశం.
దీనివెనక వ్యూహాత్మక దృష్టికోణం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మృతుల కుటుంబాలకు ఆదరణ అన్న ముసుగులో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నమంటున్నారు. భారత్‌పై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ వేదికల్లో వెనకేసి ఉండే పాక్, ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి మిలటరీ నిపుణులు సూచిస్తున్నారు.
జామియా మజ్జీద్ సుభాన్ అల్లా పేరుతో బహావల్పూర్‌లో ఉగ్ర శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న జైషే మహ్మద్, ఆపరేషన్ సిందూర్ దాడులతో తీవ్రంగా దెబ్బతింది. దాడిలో 60 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న మసూద్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడం ద్వారా పాక్ ఆ దేశాన్ని ఎంతగా ఉగ్రవాదానికి వేదికగా మార్చిందో మరోసారి ప్రపంచానికి స్పష్టం చేస్తోంది.