పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్.! కొండని తవ్వుతున్నారుగానీ.!

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ ప్రకంపనలు తెలంగాణ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. అంతకు ముందు టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నా పత్రం లీక్ అయితే, ఏకంగా మంత్రి కేటీయార్ మీద విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ లీక్ వివాదాలు నడుస్తూనే వున్నాయి.

ఇప్పడవి ముదిరాయ్.! బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేపర్ లీక్ కేసులో అరెస్టవడమంటే చాలా పెద్ద విషయమే అది. కానీ, ఈ కేసు ఎక్కడిదాకా వెళుతుంది.? ఏపీలో కొన్నాళ్ళ క్రితం పేపర్ లీక్ వ్యవహారం తెరపైకొచ్చింది. ఆ కేసు సాగుతూ సాగుతూ సాగుతూ.. వుందంతే. తెలంగాణలో పేపర్ లీక్ కేసు కూడా అంతేనా.? ఏమో, ముందు ముందు తెలుస్తుందది.

ఇదిలా వుంటే, తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ తెరపైకొచ్చింది. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) నానా యాగీ చేశాయి. చివరికి ఏమయ్యింది.? ఆ కేసు కూడా సాగుతూ సాగుతూ వుంది.. విచారణ విషయంలో. బీజేపీ ఖేల్ ఖతం అన్నారు.. కేసీయార్ రాజకీయ భవిష్యత్తుకి సమాధి అన్నారు.. ఏదీ లేదు. యాజ్ యూజువల్.. రాజకీయం అలా అలా సాగుతూనే వెళుతోంది. అప్పుడప్పుడూ వేడెక్కుతోందంతే.

కవిత విషయంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంటే, బీజేపీ విషయంలో ఇదిగో.. ఇలాంటి కేసులతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ హుషారు చూపిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. అంతేనా.? అంతకు మించి ఏమీ లేదా.? కొండని తవ్వుడు.. ఎలుకని కూడా పట్టలేకపోవుడు.. రాజకీయ నేపథ్యమున్న కేసులు ఇలాగే వుంటాయ్.!