బ్యాన్ చైనా ప్రొడక్ట్స్.. అన్నంత ఈజీ కాదు చేయడం 

ప్రజెంట్ ఇండియాలో నడుస్తున్న ట్రెండ్ బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్, బాయ్ కాట్ చైనా.  కారణం సరిహద్దుల్లో చైనా సైన్యం భారత సైన్యం మీద దాడి చేసి 20 మంది జవాన్లను బలిగొంది.  దీంతో దేశవ్యాప్తంగా చైనా మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  చైనా మీద యుద్దమే చేయాలని కొందరంటుంటే ఇంకొందరు చైనాతో వ్యాపార ఒప్పందాలను ఉన్నపళంగా రద్దు చేసుకుని వాణిజ్యపరంగా వారిని దెబ్బ తీయాలని గళం వినిపిస్తున్నారు.  ఈ పద్దతితో స్వదేశీ కంపెనీలు, ఉత్పత్తులకు గిరాకీ పెరగడమనే మాట బాగానే ఉంది కానీ చైనా ఉత్పత్తుల బ్యాన్ అనేది ఆచరణలో పెట్టడం అంత సులభం కాదని గ్రహించాలి.  ఎందుకంటే మన దిగుమతుల్లో చైనా వాటా 14 శాతం వరకు ఉంది.  
 
అసలు మన రోజువారీ జీవితాలను చూసుకుంటే చైనా ఉత్పత్తుల మీద మనం ఏ స్థాయిలో ఆధారపడ్డామో అర్థమవుతుంది.  ప్రధాన అవసరమైన మొబైల్ ఫోన్లలో శామ్ సంగ్ తర్వాత ప్రధాన వాటా చైనా కంపెనీలదే.  వివో, ఒప్పో, రియల్ మీ, వన్ ప్లస్, హువాయ్ ఇలా చాలా చైనా ఫోన్లను మన దేశ ప్రజలు విపరీతంగా వాడుతున్నారు.  కారణం తక్కువ ధరలో, బోలెడన్ని ఫీచర్లు ఆ ఫోన్లలో ఉండటమే.  బ్యాన్ చైనీస్ మాటను అందుకుని మన ప్రజలంతా చైనా ఫోన్లను విసిరికొడితే ఏమవుతుంది.  రోజువారీ జీవితం స్తంభిస్తుంది.  అలాగే టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీలు మొదలుకుని ఆట బొమ్మలు లాంటి చిన్నా చితకా వస్తువులను మనం వాడుతున్నాం.  
 
అంతెందుకు మన దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనా నుండే వస్తుందనే ఆరోపణ ఉన్నా వాటి చికిత్సలో అవసరమైన పీపీయే కిట్లు, మాస్కులు, వైరస్ నిర్థారణ కిట్లను ఆ దేశం నుండే దిగుమతి చేసుకున్నాం.  ఈ ఒక్కటీ చాలు చైనా వస్తువులు మనకు ఎంత ముఖ్యమో.  ఇక మనం అధికంగా వాడుతున్న జూమ్ యాప్, టిక్ టాక్ లాంటివి చైనా నుండి వచ్చినవే.  ఒకప్పుడంటే చైనా వస్తువుల్లో క్వాలిటీ ఉండదనే అపవాదు ఉండేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.  అన్నిటికీ వారంటీ ఉంటోంది.  పైగా ధర సామాన్యులకు అందుబాటులోనే ఉండటం చైనా ఉత్పత్తుల మరొక ప్రతేకత.  
 
ఇక మన లోకల్ కంపెనీల్లో ఈమధ్య కాలంలో చైనా కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగాయి.  మోదీ అధికారంలోకి వచ్చాక గుజరాత్ రాష్ట్రంలో చైనా పెట్టుబడులు 500 శాతం పెరిగాయంటే మన దేశ వాణిజ్య మార్కెట్లో వారికున్న ఆదరణ ఏపాటిదో  తెలుస్తోంది.  అంతెందుకు బ్యాన్ చైనా ప్రొడక్ట్స్  అంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్న చాలా న్యూస్ ఛానెళ్ళకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తోంది చైనా మొబైల్ కంపెనీలే.  అలాగే ఇండియాలో జరిగే ఐపీఎల్ లాంటి కొన్ని భారీ ఈవెంట్లకు కూడా చైనా మొబైల్ కంపెనీలే సమర్పకులు.  చైనీస్ కంపెనీలను బహిష్కరిస్తే వారిని మనం వాణిజ్య పరంగా దెబ్బతీయవచ్చేమో కానీ అలా చేస్తే మన రోజువారీ జీవితాలను, వాణిజ్యాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టుకున్నవారం అవుతాం.  చైనా కంపెనీలను బ్యాన్ చేస్తే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ కంపెనీలు, ఉత్పత్తులను, పెట్టుబడులను మనం సృష్టించుకోగలమా అనేది ఆలోచించుకోవాలి.  
 
వాస్తవంగా మాట్లాడుకుంటే మన వ్యాపార దిగ్గజాలందరూ ఏకబిగిన రంగంలోకి దిగినా అదేమంత సులభమైన పని కాదు.  ఒక దేశంతో వాణిజ్య ఒప్పందాలను ఉన్నపళంగా రద్దు చేయడం దేశ వాణిజ్య సూత్రాలకు విరుద్దం కూడ.  కాబట్టి బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్ అంటూ మాట్లాడుతున్న సామాన్యులు, సెలబ్రిటీలు తమ ఆవేశాన్ని కాస్త తగ్గించుకుని వాస్తవ పరిస్థితులను గ్రహిస్తే మంచిది.  ఇక స్వదేశీ తత్వాన్ని ప్రోత్సహించుకోవడం, పొరుగు దేశాల మీద ఆధారపడకుండా ఎదగాలనే లక్ష్యాలు తప్పకుండా గొప్పవే.  కాబట్టి చైనా ఉదంతాన్ని ఒక పాఠంగా భావించి భవిష్యత్తులో ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడానికి విశేషంగా కృషి చేయడం మంచిది.