పవన్ వెనుక బీజేపీ.. అందుకే కాపు రిజర్వేషన్ మీద అంత క్లారిటీ 

పవన్ కళ్యాణ్ ప్రజెంట్ కాపు రిజర్వేషన్ మీద, కాపులకి వైకాపా కేటాయించామని చెబుతున్న నిధుల మీద వివరణ కోరుతున్నారు.  సీఎం వైఎస్ జగన్ 2.35 లక్షల మందికి కాపు నేస్తం పథకం కింద మొదటి విడతగా రూ.354 కోట్లు బదిలీ చేశారు.  అంతేగాక వివిధ పథకాల కింద రూ.4,770 కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారు.  ఈ 4,770 కోట్లు నవరత్నాల్లో భాగంగా కాపులకు ఇచ్చినవని వైసీపీ చెబుతోంది.  దీంతో పవన్ పూర్తి లెక్కలు చెప్పమని, ఏయే బడ్జెట్లో కాపులకు ఎంతెంత నిధులు కేటాయించారో చెప్పాలని, శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  కేవలం కాపుల కోసమే అచ్చంగా ఏడాదికి 2000 కోట్లు ఖర్చు పెడతామన్న జగన్ అందరితో పాటే ఇచ్చిన నవరత్నాల లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. 
 
దీంతో అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబులతో సహా వైకాపా అగ్ర నేతలంతా పవన్ మీద ఎదురుదాడికి దిగారు.  చంద్రబాబు హయాంలో కాపులకు అన్యాయం జరిగితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని, అసలు కాపుల పట్ల పవన్ చిత్తశుద్ది ఏపాటిదో చెప్పాలని డిమాండ్ చేశారు.  దీంతో జనసేన శ్రేణులు మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన 16 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు.  ఒకవేళ జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే అదే తరహాలో కాపు రిజర్వేషన్లను అమలుచేస్తామని అన్నారు.  జనసేన నేతలు ఇంత ధీమాగా ఇలాంటి ప్రకటన చేశారు అంటే రిజర్వేషన్ పట్ల వారికి పూర్తి క్లారిటీ ఉన్నట్టు అర్థమవుతోంది. 
 
ఒక్కసారి మహారాష్ట్ర మరాఠ రిజర్వేషన్లను అంశాన్ని పరిశీలిస్తే కేంద్రం తలుచుకుంటే రిజర్వేషన్ల అమలు ఎంత సులభమో స్పష్టత వస్తుంది.  మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకి 16 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఆ తర్వాత వాటిని 12కి కుదించింది.  50 శాతం రిజర్వేషన్ల నియమాన్ని కూడా సులభంగా సవరించింది.  ఈ విషయాన్నే గుర్తు చేసిన జనసేన అదే తరహాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయవచ్చని అంటోంది.  చంద్రబాబు తన హయాంలో 5 శాతం రిజర్వేషన్ల బిల్లుకి 2017 డిసెంబర్లో అసెంబ్లీలో ఆమోదం తెలిపారు.  కానీ ఆ పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 55 శాతానికి చేరుతాయి. దీంతో బిల్లు కేంద్రం ముందుకు వెళ్లగా కేంద్రం అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ బిల్లును తిరస్కరించింది. 
 
దీంతో టీడీపీ మేము బిల్లు పెట్టాం కానీ కేంద్రం ఆమోదించలేదని అంటే అప్పటి ప్రతిపక్షం వైకాపా కూడా అది కేంద్రం చేతుల్లో వ్యవహారమని తప్పించుకుంది.  చివరకు ఎన్నికలకి ముందు కేంద్రం అగ్రవర్ణ పేదలకి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలోనే కాపుల 5 శాతం రిజర్వేషన్లను చేర్చినట్టు టీడీపీ ప్రకటించి చేతులు దులుపుకుంది.  దీంతో కాపుల ఆశలు నిరాశలుగానే మిగిలాయి.  2019 ఎన్నికలకి ముందు జగన్ కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని అంటే జనసేన మాత్రం 5 శాతం రిజర్వేషనుకే కట్టుబడే  ఉంది.  ఇప్పుడు కూడా మారాఠా తరహాలో రిజర్వేషన్ అమలు సాధ్యమని, దానికి రాజ్యాంగం పెద్ద అడ్డు కాదని అంటోంది.  
 
ఈ మాటల్ని బట్టి జనసేన, భాజపా పొత్తులో మొదటి ప్రాధాన్యం కాపు రిజర్వేషన్ అమలుకే యిచ్చినట్టు, కేంద్రం సైతం ఈ విషయంలో పవన్ కు మాట ఇచ్చి ఉండొచ్చని స్పష్టంగా తెలుస్తోంది.  భవిష్యత్తులో పవన్ బహిరంగంగా ఈ విషయంపై ప్రకటన చేసి వచ్చే ఎన్నికల నాటికి దాన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకుని కాపు ఓటు బ్యాంకును చాలా వరకు తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది.  గతంలో మాదిరి ప్రత్యేక హోదా హమీలా కాపు హామీని బీజేపీ మరువకుండా తగిన జాగ్రత్తలు కూడా పవన్ తీసుకునే ఉండవచ్చు.  మొత్తం మీద టీడీపీ, వైకాపాలకు సాధ్యం కాని కాపుల రిజర్వేషన్ను తాను సాధిస్తానని పవన్ కాపు సామాజిక వర్గానికి గట్టిగా సంకేతాలిస్తున్నారన్న మాట.