ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు ఎందుకు?

 

కార్తీకమాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం. ఈ మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని వెతుకుతుంటారు. దీనికోసం ఉసరి చెట్టు ఉన్న వనాల దగ్గరకు పోతారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హిందూ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి పూజించి అక్కడ వనభోజనాలను చేస్తారు.

Why picnics near the eucalyptus tree
Why picnics near the eucalyptus tree

దీనికి కారణం.. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఏది సకల మానవాళిని రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం మరియు దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు.