మన హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకే కాకుండా కొన్ని మొక్కలు జంతువులకు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన దేశంలో పూజింపబడే మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మొక్కలను పూజించటం వల్ల గ్రహాల స్థానం బలపడటమే కాకుండా దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా మన భారతదేశంలో తులసి, వేప, ఉసిరి, తెల్ల జిల్లేడు మొక్కలకు పూజలు నిర్వహిస్తారు. ఈ మొక్కలు మాత్రమే కాకుండా శని దేవుడికి ఇష్టమైన శమి మొక్కను కూడా పూజిస్తారు. ఇలా శనివారం రోజున శమి మొక్కను పూజించటం వల్ల ఆ శని దేవుడి అనుగ్రహం కలుగుతుందని ప్రజల విశ్వాసం.
శనివారం రోజున శమీ మొక్కను పూజించడం వల్ల రాశుల గ్రహస్థితి బలపడుతుంది. ప్రతిరోజు శమీ వృక్షానికి నీరుపోసినా కూడా పుణ్యఫలం లభిస్తుంది. ఈ శమీ మొక్క శివుడికి కూడా ప్రీతిపాత్రమైనది. అందువల్ల శనివారం రోజున ఇంట్లో దక్షిణ దిశలో ఈ చెట్టుని నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఒకవేళ దక్షిణ దిశలో సూర్యకాంతి తక్కువగా ఉన్నట్లయితే ఈ మొక్కను తూర్పు దిశలో లేదా ఈశాన్య దిశలో నాటవచ్చు. ఇలా శనివారం రోజున ఇంట్లో శమీ మొక్కను నాటడం వల్ల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ముఖ్యంగా ప్రధాన ద్వారం కుడి వైపున ఈ మొక్కను ఉంచటం వల్ల చేసే ప్రతి పనిలో విజయం లభించి ధన లాభం కలుగుతుంది.
శనివారం రోజున శమీ మొక్కను పూజించి ఆ మొక్క వద్ద ఆవాల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దేవుడితో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా ప్రతి శనివారం శమీ మొక్కను పూజించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభించి జీవితంలో ఎదురయ్యే కష్టాలు దూరం అవుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమై కలకాలం సిరిసంపదలతో తులుతూగుతారు. అంతేకాకుండా ఈ మొక్కను పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.