హనుమంతుడు.. కలియుగంలో శ్రీఘ్రంగా వరాలు ఇచ్చే దేవుడు. చిన్ననుంచి పెద్దవారి వరకు అందరికీ ప్రీతిపాత్రుడు ఆ స్వామి, అయితే ఆ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడం వెనుక కారణం ఇదే… ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.
స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.