శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శన టిక్కెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా..?

మన భారత దేశంలో ఎన్నో దేవాలయాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలా ప్రత్యేక గుర్తింపు కలిగిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. ఇలవైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఏడుకొండల మీద కొలువైయున్న ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుంటారు. కనులారా ఆ ఏడుకొండల వాడిని వీక్షించాలని గంటల తరబడి భక్తులందరూ క్యూ లైన్ లో వేచి ఉంటారు. అయితే భక్తుల దర్శనం కోసం టీటీడీ కొన్ని ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసి భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది.

మార్చి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా శుక్రవారం (ఫిబ్రవరి 24) ఉదయం 10 గంటలకు విడుదల అయ్యింది. అలాగే ఏప్రిల్, మే నెలలకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్లు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ కానుంది. ఈమేరకు దర్శన టికెట్ల విడుదలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో భక్తులు ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్లను బుక్ చేసుకుని అవకాశం కల్పించింది.

అయితే భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శన్ టికెట్ల కోసం ఆన్లైన్లోనే కాకుండా తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లను పొందవచ్చు. ఇక మార్చి నెలకు సంబంధించి వెయ్యి శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారని టీటీడీ వెల్లడించింది.