పూల పండుగ బతుకమ్మ. తొమ్మిదిరోజులు తంగేడు, బంతి, చామంతి వంటి రంగురంగు పూలతో తొమ్మిది రకాల నైవేద్యాలతో అంగరంగవైభంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. అక్టోబర్ 21వతేదీకి ఆరోరోజుకు చేరింది. అయితే ఈ రోజు ఆరోరోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. దీనివెనుక కథను తెలుసుకుందాం. .. అమ్మవారి దేవి భాగవతంలో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసింది.
భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో ఇది అలిగిన బతుకమ్మగా మారింది. ఐదురోజుల పాటు బతుకమ్మ సంబురాలు మిన్నంటిన తరుణంలో.. ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరు మీద వేడుకలు నిర్వహించరు. మళ్లీ ఏడోనాడు నుంచి ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. దీని తర్వాత మూడురోజులు అమ్మవారిని ఆరాధించి చివరిరోజు పలు రకాల నైవేద్యాలతో బతుకమ్మను చెరువుల్లో కలిపి ఒలలాడించి ప్రసాదాలను పంచుకుని ఇంటికి వస్తారు.