మేడారం సమ్మక్క సారక్క జాతర… పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం…!

తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన మేడారం జాతర మొదలయింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో కొలువైయున్న సమ్మక్క సారక్క జాతరను ప్రతి ఏడూ ఎంత ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రజలందరూ ఈ మేడారం జాతరకు వెళ్లి ఆ వనదేవతలను దర్శించుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు ఈ జాతరకు హాజరవుతారు. అందువల్ల మేడారం జాతరకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు. ఇటీవల స్థానిక పోలీసులతో కలిసి ఆయన మేడారంలోని సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేడారం జాతర పరిసర ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మినీ మేడారం జాతర కు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకునీ ప్రశాంతంగా వారి ఇంటి తిరిగి వెళ్లేలా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మేడారంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. మేడారం గద్దెల ప్రాంగణం, ఆర్టిసి బస్టాండ్, చిలకల గుట్ట రెడ్డి గూడెం వంటి జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాలలో క్యూ లైన్ లు ఏర్పాటు చేసి కట్టుకుట్టమైన భద్రతను ఏర్పాటు చేపట్టినట్లు వివరించారు.

ఈ ఏడాది జరిగే మినీ జాతరలో భక్తుల మధ్య ఎలాంటి గొడవలు, గలాటాలు జరగకుండా దాదాపు 400 మంది పోలీసు అధికారులతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జాతరలో దొంగతనాలు జరగకుండా, అలాగే జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిగాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పసర సీఐ వంగా శంకర్, పసర ఎస్సై కరుణాకర్ రావు, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు, సిఆర్పిఎఫ్, సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మినీ మేడారం జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనమందరం కోరుకుందాం.