Medaram: ములుగు జిల్లా మేడారం భక్త జన సంద్రంగా మారింది. మారుమూల అటవీ ప్రాంతం భక్తుల రద్దీతో మహానగరాన్ని తలపిస్తోంది. లక్షలాదిగా జనాలు సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒడిశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారానికి వెళ్లే దారులు మొత్తం భక్తులతో నిండిపోయాయి.
నిన్న సమక్క తల్లిని చిలకల గుట్ట నుంచి అంగరంగ వైభవంగా గద్దెలపైకి తీసుకువచ్చారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గన్ ఫైర్ చేసి సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి వెళ్లే దాకా అశేష భక్త జనం తమ ఆరాధ్య దైవం వస్తుండటంతో.. సమ్మక్క తల్లి నినాదాలతో మారు మోగింది మేడారం. పటిష్ట భద్రత మధ్య సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి తీసుకువచ్చారు. అంతకుముందు రోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు.
ఈరోజు, రేపు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు వనదేవతలు. రేపు సాయంత్ర మళ్లీ వన ప్రవేశం చేయనున్నారు. దీంతో నేడు, రేపు కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకోనున్నారు.
గురువారం రాత్రి సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి మేడారం గద్దెల వద్దకు తీసుకువచ్చారు. వేలాది మంది వెంటరాగా.. భారీ భద్రత మధ్య గద్దెల వద్దకు తీసుకువచ్చారు. అయితే ఇలా తీసుకువచ్చే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సమ్మక్క తల్లి ఊరేగింపు సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సమయంలో ఇద్దరు భక్తులు తొక్కిసలాటలో మృతి చెందారు. పోలీసులు గుర్తించి.. ప్రథమ చికిత్స అందిచే లోపే ఆ ఇద్దరు మృతి చెందారని తెలుస్తుంది. కాగ మృతి చెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.