కార్తీక ఏకాదశి గోపద్మ వ్రతం !

కార్తీకంలో ప్రతి ఒక్కరోజు చాలా పవిత్రమైనదే. అందులో ఏకాదశి అంటే మరి విశేషమైనది. కార్తీకశుద్ధ ఏకాదశి రోజున ‘గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైనది. గోమాత విరాట్ పురుషునితో పోల్చబడింది. గోవు ముఖంలో వేదాలు, కొమ్ములలో హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు. ఫాలభాగంలో ఈశ్వరుడు, చెవులలో అశ్వినీదేవతలు, కన్నులలో సూర్యచంద్రులు, దంతాలలో గరుడ, నాలుకలో సరస్వతి, ఉదరంలో స్కందుడు, రోమకూపంలో ఋషులు, పూర్వభాగంలో యముడు, పశ్చిమ భాగంలో అగ్ని, దక్షిణ భాగంలో వరుణకుబేరులు, వామభాగంలో యక్షులు, ముఖంలో గంధర్వులు, నాసాగ్రంలో పన్నగలు, అపానంలో సరస్వతి, గంగాతీర్థం, గోమయంలో లక్ష్మీ, పాదాగ్రంలో ఖేచరులు, అంబా అంటూ అరిచే అరుపులో ప్రజాపతి, స్తనంలో నాలుగు సాగరాలు ఉన్నట్లుగా వర్ణింపబడింది.

అందుకే గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అని, సమస్త తీర్థాలలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇటువంటి గోమాత నివశించే గోశాలను కార్తీకశుద్ధ ఏకాదశి రోజున శుభ్రంచేసి అలికి ముత్యాలముగ్గులతో రంగావల్లికలు తీర్చిదిద్ది గోశాల మధ్యభాగంలో బియ్యపు పిండితో ముప్పై మూడు పద్మాల ముగ్గులను వేసి, శ్రీమహాలక్ష్మీదేవి సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమలను పద్మములపై ఉంచి, వారిని శాస్త్రోక్తంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై పెట్టి ఆ అప్పడాలను, వాయనాలను, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడిని సంతృప్తిపరచి, గోమాతను పూజించే వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి. అవకాశం ఉన్నవారు వ్రతాన్ని ఆచరించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి.