చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా వైకుంఠంగా ప్రఖ్యాతిగాంచింది. తిరుమల తిరుపతిలో కొలబై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి చేరుకుంటారు. కోరిన కోరికలు తీర్చే ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకోవటానికి సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడ వస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి టిటిడి భక్తులకు ఒక శుభవార్త తెలిపింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే వైకుంఠ దర్శన టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ఈ తేదీలలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల భక్తులు టికెట్లు పొందటానికి అవస్థలు పడకుండా జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల భక్తులకు వైకుంఠ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ఇలా జనవరి ఒకటవ తేదీ నుండి 10 వ తేది వరకు ప్రతిరోజు రోజుకు 50 వేల చొప్పున 10 రోజుల పాటు 5 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది .
అంతే కాకుండా 10 రోజుల కోటా ముగిసిన తర్వాత కూడా ఆఫ్ లైన్ విధానంలో నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రినగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూల్ లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి వెల్లడించింది.ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టిటిడి తెలిపింది.నిన్న 70,373 మంది భక్తులు శ్రీ వారిని దర్శించుకోగా.. 32,954 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.