మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పుట్టిన ఏడాదిలోగా లేదా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పని సరిగా పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. ఇలా పుట్టు వెంట్రుకలు తీయడం ఒక ఆచార సాంప్రదాయంగా వస్తుంది.అయితే ఇలా పిల్లలు జన్మించిన ఏడాది మూడవ ఏటా లేదా ఐదవ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే… మన శిరోజాలు మన పాపాలను తెలియజేస్తూ ఉంటాయని భావిస్తారు. అందుకే చాలామంది తాము చేసిన పాపాలు తొలగిపోవడం కోసం దేవుడికి భక్తితో తలనీలాలను సమర్పిస్తామని మొక్కుతారు.
ఇక ఏడాదిలోగా పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి కూడా కారణం అదే.గత జన్మలో చేసిన పాపాలను తొలగించడమే కాకుండా జ్ఞానం కోసం కూడా ఇలా పుట్టు వెంట్రుకలను తీయించే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మగ పిల్లలకు సరి నెలల్లోనూ ఆడపిల్లలకు బేసి నెలలోనూ పుట్టు వెంట్రుకలు తీయించడం ఆచారం. కేశఖండని జరిపించడానికి అనుకూలమైన వారాలు సోమ, బుధ,గురు,శుక్రవారాలు ఎంతో అనుకూలమైనవి
ఈ వారాలలో మధ్యాహ్నం 12 గంటలలోపు పుట్టు వెంట్రుకలు తీయించడం మంచిది. ఇకపోతే శిశువు తల్లి తిరిగి మరోసారి గర్భం దాల్చినప్పుడు కూడా పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.అయితే ఐదు నెలల లోపు ఆమె గర్భవతి అయితే తీయించవచ్చు కానీ ఐదు నెలల గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తిరిగి తన శిశువుకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.ఇలా పుట్టు వెంట్రుకలు తీయడం వల్ల పాపప్రక్షాళన జరగడమే కాకుండా శిశువు జ్ఞానోదయానికి కూడా దోహద పడుతుంది.