ప్రేమికుని తీరుకు బలైన నల్లగొండ నందిని

ఓ ప్రేమికుని తీరుతో ఓ అమాయకురాలు తనువు చాలించింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతని తీరుతో ఆమె జాలి గుండె కరిగింది. ఇంకో స్టెప్పు ముందుకెళ్లిన అతడు ఆమెను లోబర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకొమ్మంటే ముఖం చాటేశాడు. అవమానంతో ఆ యువతి  ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన పోకబత్తిని నందినికి 25 సంవత్సరాలు. నందిని ప్రస్తుతం నేరేడుచర్ల ప్రాథమిక ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్దతిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తోంది. అంతకు ముందు ప్రైవేటు హాస్పిటల్ లో నర్సుగా పని చేసింది.

ఆ సమయంలో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం గ్రామానికి చెందిన చేగొండి బాలరాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని బాలారాజు ప్రేమించాలంటూ నందిని వెంట పడ్డాడు. అలా నందినిని ప్రేమలోకి దింపాడు. ఆ తర్వాత నమ్మించి శారీరకంగా కూడా కలిశాడు. 

ఇటివల కాలంలో నందినికి పెళ్లి సంబంధాలు వస్తుండడంతో  పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో బాలరాజు తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని నువ్వే వచ్చి ఒప్పించాలని అన్నాడు. దీంతో నందిని అలాగే వారింటికి వెళ్లింది. బాలరాజు కుటుంబ సభ్యులు నందినిని తిట్టి కొట్టి వారింటికి పంపారు.

 బాలరాజును నందిని నిలదీయగా తానేమి చేయలేనని వేరే పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. దీంతో నందిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దీని పై సరిగా స్పందించలేదు. ఇంతలో బాలరాజు అన్న నందిని దగ్గరకు వచ్చి ఆమె ఫోన్ పగులకొట్టి ఆధారాలు లేకుండా చేశాడు.

 పోలీసులు స్పందించకపోవడం, పరువు పోవడంతో అవమానంగా భావించిన నందిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నందిని చనిపోయే ముందు రాసిన లేఖ అందరిని కంటతడి పెట్టిస్తుంది. నందిని లేఖలో ఏం రాసిందంటే…

 ‘‘ఆర్నెల్లుగా ఏడ్వని రోజు లేదు. చదువే లోకంగా ఉద్యోగమే ధ్యాసగా ఉన్న నా జీవితంలోకి వచ్చిన మోసగాడు నన్ను నా కుటుంబానికి దూరం చేస్తున్నాడు. చచ్చిపోయేలా బెదిరించాడు. ప్రేమించానని.. నీవు లేకుంటే బతకలేనని ఇంట్లో వాళ్లని ఎదిరించి వస్తానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

తర్వాత దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మోసగాని కుటుంబం మొత్తం కులం పేరుతో దూషించి నన్ను చనిపోయేలా వేధించారు.. కొట్టారు. అతణ్ని, అతడి కుటుంబాన్ని వదలొద్దు.’’ అని నందిని లేఖలో రాసింది.

నందిని కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని వారు కోరారు.  

 ఇది కూడా చదవండి

https://telugurajyam.com/road-accident-in-nalgonda-2/