నెల్లూరు జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. జిఎస్ రాయల్ సెంటర్ దగ్గర కూతురి పై తండ్రి కత్తితో దాడి చేశాడు. కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పట్టపగలే దారుణం జరగడంతో అంతా షాకయ్యారు.
నెల్లూరు పట్టణానికి చెందిన దేవయాని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. అది నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారు. దేవయాని శుక్రవారం మధ్యాహ్నం జిఎస్ రాయల్ సెంటర్ దగ్గరకు రాగా దేవయాని తండ్రి ఆమె పై కత్తితో దాడి చేశాడు. కత్తితో తలకాయ, మెడ భాగాల పై బలంగా దాడి చేశాడు. ఇంతలోనే ఘోరాన్ని అడ్డుకోవడానికి స్థానికులు ముందుకు వచ్చారు. దీంతో దేవయాని తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవయాని పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు నెల్లూరులోని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు.
ఇటీవల ప్రేమ వివాహాల కథలన్నీ విషాదంగా మిగులుతున్నాయి. కూతర్లు కులాంతర వివాహం చేసుకున్నారని తండ్రులే దారుణానికి ఒడిగడుతున్నారు. మిర్యాల గూడలో ప్రణయ్ ఘటన నుంచి నెల్లూరులో దేవయాని ఘటన వరకు అనేక సంఘటనలు జరిగాయి. తండ్రులే కూతుళ్ల పై ప్రేమ లేకుండా చంపాలని ప్రయత్నిస్తున్న తీరు అందరిని కలవర పెడుతోంది.
మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారని అమృత తండ్రి కిరాతకంగా ప్రణయ్ ని చంపించాడు. కిరాయి రౌడీలకు సుఫారి ఇచ్చి ప్రణయ్ ని అంతమొందించాడు. ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అమృత వైశ్య సామ ాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాగా, ప్రణయ్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అమృత తండ్రి మారుతీరావు కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో రగిలిపోయి బీహార్ నుంచి కిరాయి రౌడీలను పిలిపించాడు. అమృత, ప్రణయ్ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా పట్టపగలే నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ప్రణయ్ ని కిరాయి రౌడీ కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ఇది జరిగిన కొద్ది రోజులకే హైదరాబాద్ అమీర్ పేటలో చారి అనే వ్యక్తి తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించి అమీర్ పేట చౌరస్తాకు పిలిచాడు. అక్కడ వారు ఉండగా కొబ్బరి బొండాీలు కొట్టె కత్తితో కూతురు అల్లుడి పై దాడి చేశాడు. అల్లుడు తప్పించుకోగా కూతురి పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. చావు అంచులకు వెళ్లి వచ్చిన ఆమె అదృష్టవశాత్తు బతికింది.
ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పట్టపగలే దేవయాని పై దాడి జరగడంతో అంతా షాక్ కు గురయ్యారు. ప్రేమించినంత మాత్రాన చంపేస్తారా అని పలువురు విమర్శిస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఆలోచించాలని ఇలా నరుక్కుంటూ పోతే సమాజంలో తప్పుడు పోకడలు ఏర్పడతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దేవయాని తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.