ప్రస్తుతం కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికీ ముదనమ్మకాలను నమ్ముతున్నారు. చేతబడి, క్షుద్రపూజలు వంటి వాటిని చూసి జనాలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాక చేతపడి చేస్తున్నారనే కారణంతో హత్యలకు కూడా పాల్పడుతున్నారు. మూఢ విశ్వాస కారణంగా ఇప్పటికే అనేక దారుణ ఘటనలు జరిగాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. తన తల్లికి చేతబడి చేయడంతోనే అనారోగ్యానికి గురైందని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి తన సమీప బంధువును వేటకత్తితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు(50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు. అలానే గ్రామదేవత ఉప్పలమ్మ పండుగలకు పూజారిగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల శ్రీనివాస రావు సమీప బంధువైన పాటిబండ్ల శివ తల్లి అనారోగ్యానికి గురైంది. శివకు శ్రీనివాసరావు పెదనాన్న వరుస అవుతాడు. అయితే తన తల్లి అనారోగ్య బారిన పడటానికి శ్రీనివాసరావు చేతపడే కారణమని శివ అనుమానించాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావుపై కక్ష పెంచుని అతడిని హతమార్చాలని ప్లాన్ చేసాడు .
ఈ మేరకు ఆదివారం శ్రీనివాసరావు తన పొలంలో పని చేస్తుండగా అక్కడి వెళ్లిన శివ అతడితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న వేట కత్తితో శ్రీనివాసరావు మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావుపై శివ దాడి చేయడం పక్క పొలంలో ఉన్న సంజీవరావు అనే వ్యక్తి చూసి.. అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే శివ అతడిపై కూడా దాడి చేసేందుకు యత్నించగా.. భయంతో అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివ మీద కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు.