సాధారణంగా చాలామంది కష్టపడి పనిచేయకుండా సులభంగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సులభంగా డబ్బులు సంపాదించుకోవడానికి దొంగతనాన్ని మార్గంగా ఎంచుకుంటారు. ఇలా దొంగతనం చేసి జీవితంలో స్థిరపడిపోవచ్చునని భావించి ఎంతోమంది దొంగతనాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. అయితే ఇటీవల ఒక స్టోర్ కి కాపలా ఉండవలసిన సెక్యూరిటీ గార్డ్ తన స్నేహితుడితో కలిసి ఆ స్టోర్ కి కన్నం వేసి దొంగతనానికి పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మరికంటి రవికుమార్(25) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ చేరుకొని నగరంలోని కొత్తపేటలో ఉంటూ ఉప్పల్ భగాయత్‌లో ఉన్న జియో మార్ట్ స్టోర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న రవికుమార్ డిసెంబర్ 29వ తేదీన రాత్రి మార్ట్ సిబ్బంది స్టోర్ లో ఉన్న లాకర్లో డబ్బులు ఉంచటం గమనించాడు. దీంతో ఎలాగైనా ఆ డబ్బు దొంగలించి జీవితంలో స్థిరపడాలని భావించాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన కొయ్యాడ ఉప్పలయ్య (25) అనే తన స్నేహితుడితో ఈ విషయం గురించి వివరించాడు.
లాకర్ లో ఉంచిన డబ్బును ఎలాగైనా దొంగలించాలని భావించినా రవికుమార్ తన స్నేహితుడు ఉప్పలయ్య తో కలిసి అర్ధరాత్రి దాటాక స్టోర్ లోకి ప్రవేశించాడు. లాకర్ తాళాలు స్టోర్ లోపలే పెడతారని గుర్తించిన రవికుమార్ లాకర్ తాళాలను తీసుకొని అందులో ఉన్న రూ.2,69,303 తన స్నేహితుడితో కలిసి దొంగిలించాడు. మరుసటి రోజు ఉదయం స్టోర్ లో ఉన్న లాకర్‌ను గమనించిన సూపర్‌వైజర్ డబ్బు దొంగలించబడిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని స్టోర్ లోపల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రవికుమార్ అతడి స్నేహితుడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. డబ్బు దొంగలించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని శనివారం అరెస్టు చేసి నగదును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.