తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛెయిర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ మీద తెలుగుదేశం ఎంపి రాయపాటి సాంబశివరావు బాంబే శారు. బాంబంటే బాంబుకాదు, బాంబు లాంటి మాట అన్నారు. టిటిడి ఛెయిర్మన్ ఉత్త డమ్మీ అన్నారు. టిటిడిలో ఏముంది, ఏమీలేదు. పెత్తనం అంతా అధికారులదే. టిటిడి చైర్మన్ తో సహా బోర్డంతా డమ్మీయే అని అనేశారు. ఎంత పెద్ద మాట?
మొన్నమొన్నటి దాకా ఆయన టిటిడి చైర్మన్ పోస్టు బాగా ప్రయ్నత్నించారు. రాష్ట్రంలో బాగా డబ్బున్న కాంట్రాక్టర్ పోలిటిషియన్ అయినా రాయపాటికి ఈ పోస్టు రాలేదు. ముఖ్యమంత్రి చందబాబు నాయుడు మరొక కాంట్రాక్టర్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ఎంచుకున్నారు. రాయపాటికి టిటిడి బోర్డు సభ్యుడి పదవినిచ్చి గౌరవించారు.
రాయపాటి నిన్న తిరుమల వచ్చారు. ఈ మధ్య మహాసంప్రోక్షణం పేరుతో ఒక తొమ్మిది రోజుల పాటు భక్తుల దర్శానికి టెంపుల్ హాలిడేప్రకటించాలని టిటిడి నిర్ణయించివిమర్శల పాలయిన సంగతితెలిసిందే. తర్వాత ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిర్ణయాన్ని సవరించుకోమని సలహా ఇచ్చారు. దీనికోసం నిన్న బోర్డు సమావేశమయింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాయపాటి తిరుమల వచ్చారు. ఈ సమావేశం తర్వాత రాయపాటి టిటిడి నడుస్తున్న తీరుమీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
’టిటిడి వ్యవహారమంతా వన్‌వే ట్రాఫిక్. ఆఫీసర్ల ఇష్టం ప్రకారమే అంతా నడుస్తుంది. ఇక్కడ ఏ విషయాలూ (మాకు) చెప్పరు. అధికార్లు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు. మహాసంప్రోక్షణ దర్శనాల విషయం ఎవరికీ చెప్పకుండా ముందు నిర్ణయం తీసుకుని ఆ తర్వత మాకు చెప్పారు. మహాసంప్రోక్షణ రోజుల్లో ఆలయంలో పూజలు ఎక్కువగా ఉంటాయని, 1500 మంది రుత్వికులు వస్తారని, భక్తులను దర్శనానికి అనుమతిస్తే పూజలు సరిగా జరగవని మాకు చెప్పారు. భక్తుల దర్శనాలు నిలిపేయకతప్పదని అన్నారు. చర్చ లేకుండా ఈ విషయాన్ని వారే ప్రకటించారు. ఇది ఎలావుంది, వన్‌వే ట్రాఫిక్‌లాగా లేదూ.’ అని వ్యంగ్యాస్త్రాలు వేశారు.
‘టిటిడిలో జెఈవోలు, ఈవోలదే పెత్తనం. మా బోర్డు సభ్యల పెత్తనం సాగదు. ఛైర్మన్ డమ్మీ. ఛెయిర్మన్ డమ్మీ అయిపోయాక బోర్డు సభ్యులను పట్టించుకునే నాధుడుంటారా. లేరు. ఇక్కడికి వస్తే మమ్మల్ని పట్టించునే అధికారే లేరు.నేనయితే పొద్దున వచ్చినా , ఇప్పటిదాకా వచ్చి పలకరించిన నాథుడు లేరు. నేను సభ్యుడిగా కొత్తగా లేను. 30 ఏళ్ల క్రితమే నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బోర్డు సభ్యునిగా ఉన్నా. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడానో. అపుడు బోర్డు సభ్యులకు ఎంతో గౌరవం ఉండేది’ అని బాధ పడ్డారు.