“ఇంటింటికీ కోడెల”… కన్నా అదృష్టానికే వదిలేస్తారా?

ఏ ముహూర్తాన్న కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కారో తెలియదు కానీ… నాటి నుంచీ రోజూ ఏదో ఒక టెన్షన్ వెంటాడుతూనే ఉంది. పార్టీలోకి రాకముందు కన్నాను టీడీపీలో ఒక వర్గం బలంగా వ్యతిరేకించింది! రాయపాటి సాంబశివరావు అయితే పార్టీలో చేరిన తర్వాత కూడా కన్నాపై పరోక్షంగా విమర్శలు చేశారు. అన్నీ అనేసి… “పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం” అని కన్ క్లూజన్ ఇచ్చారు. అయితే తాజాగా సత్తెనపల్లి ఇన్ చార్జ్ అయిన కన్నాకు… ఇంటిపోరు తీవ్ర రూపం దాలుస్తుందనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు కొత్త హెడేక్ స్టార్ట్ అయ్యింది. ఆయన రాకను పెద్దగా స్వాగతించని నేతలు.. ఆయనకు సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ పదవి ఇవ్వడంతో నేరుగా విమర్శిస్తున్నారు. మైకుల ముందు చంద్రబాబుని సైతం తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు. ఇందులో భాగంగా దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం… కన్నాకు పక్కలో బల్లెంలా తయారవుతున్నారు!

2019 ఎన్నికల అనంతరం ఘోర ఓటమి తర్వాత సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్తలకు తోడుగా కోడెల శివరాం ఉన్నారు! సత్తెనపల్లిలో ఈ నాలుగేళ్లూ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. దీంతో కచ్చితంగా ఈసారి సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు తనకే అని బలంగా భావించారు. చంద్రబాబు తనకుటుంబానికి అన్యాయం చేయరని, కోడెల ఫ్యామిలీని వెన్నుపోటు పొడవరని నమ్మారు. అయితే తాజాగా కోడెల కుటుంబానికి షాకిస్తూ… కన్నాను ఇన్ ఛార్జ్ చేశారు చంద్రబాబు.

అనంతరం చంద్రబాబు వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ… మైకుల ముందు బాబు ప్రవర్తనపైనా, తన తండ్రి మరణం అనంతరం, చంద్రబాబు తన కుటుంబం విషయంలో అనుసరించిన వైఖరి పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో “ఇంటింటికీ కోడెల” అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు కోడెల శివరాం. ఇప్పుడు ఈ కార్యక్రమం కన్నాను టెన్షన్ పెడుతుందని అంటున్నారు.

అవును… సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తూ… “ఇంటింటికీ కోడెల” కార్యక్రమాన్ని నిర్వహించాలని శివరాం నిర్ణయించారు. అందులో భాగంగా.. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రజలను పలుకరిస్తున్నారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో… టీడీపీ ఓట్లలో చీలిక తీసుకొచ్చేలా శివరాం వ్యవహారశైలి ఉందని కన్నా వర్గం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కారణం… శివరాం సంగతి కాసేపు పక్కనపెడితే… కోడెల శివప్రసాద్ కి సత్తెనపల్లిలో బలమైన మద్దతు ఉంది. టీడీపీలో ఆయనకు సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. అవన్నీ ఇప్పుడు టీడీపీకి పడతాయని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఓటు బ్యాంకులో భారీగా చీలిక తీసుకురావడానికి శివరాం ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న కన్నా వర్గం… ఈ విషయంలో శివరాం ను కట్టడి చేయాల్సిందిగా చంద్రబాబును కోరనుందంట.

ఈ వ్యవహారంలో శివరాం.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా మారిపోతున్నారని.. దీంతో కోడెల ఫ్యామిలీపై సానుభూతి పెరిగే ఛాన్స్ ఉందని.. ఫలితంగా ఈ సమస్య చినికి చినికి గాలివానగా మారే ప్రమాధం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. అందుకే మొక్కగా ఉన్నప్పుడే శివరాం కార్యక్రమాలను తుంచాలని రిక్వస్ట్ లు చేస్తున్నారంట!

మరి ఈ సత్తెనపల్లి పంచాయతీలో చంద్రబాబు కల్పించుకుంటారా.. శివరాం ను కూల్ చేసి కట్టడిచేస్తారా.. లేక, కన్నా అదృష్టానికే సమస్యను వదిలేస్తారా అన్నది వేచి చూడాలి!