టీటీడీ ఛైర్మన్‌గా ‘రెడ్డి’ ఎందుకు వుండకూడదు.?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేయడం, ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అవడం తెలిసిన విషయాలే.

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో కూడా ఆయన ఓ సారి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ పదవిలో వున్న వైవీ సుబ్బారెడ్డి, పదవీ కాలం ముగుస్తున్న దరిమిలా, ఆ పదవి కోసం పోటీ వైసీపీలో అనూహ్యంగా పెరిగింది.

బీసీకే ఆ పదవి ఇవ్వాలని తొలుత వైఎస్ జగన్ అనుకున్నా, భూమన కరుణాకర్ రెడ్డి నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో, చివరి నిమిషంలో ఈక్వేషన్స్ మారాయని అంటున్నారు. రెండు దఫాలు వైవీ సుబ్బారెడ్డి.. ఇప్పుడేమో భూమన కరుణాకర్ రెడ్డి.. అంతా రెడ్లేనా.? ఇతర సామాజిక వర్గాలు ముఖ్యమంత్రికి కనిపించడంలేదా.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది.

వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత. పైగా, పెద్దాయన.! ఆయన మీద కూడా గతంలో చాలా విమర్శలొచ్చాయి.. టీటీడీ ఛైర్మన్‌గిరీ విషయంలో. ఇప్పుడేమో భూమన కరుణాకర్ రెడ్డి వంతు.

భూమన కుమార్తెకు క్రైస్తవ సంప్రదాయంలో పెళ్ళి జరగడం, గతంలో భూమన వామపక్ష భావజాలం కలిగి వుండడం.. ఇవన్నీ ఆయన ఇప్పుడు టీటీ ఛైర్మన్ పదవి స్వీకరించనుండడానికి సంబంధించి వివాదాస్పద అంశాలవుతున్నాయి.

రెడ్డి తప్ప.. ఇంకో సామాజిక వర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడం వైఎస్ జగన్‌కి ఇష్టం లేదా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. అందులోనూ వాస్తవం లేకపోలేదు. కానీ, రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం ఎందుకు ఇవ్వకూడదు.? అంటే, అదీ ఆలోచించాల్సిన విషయమే.