ఎస్వీ కాలేజీలో ఆందోళన: ఎస్సైపై దాడి చేసిన విద్యార్థులు

తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైలు కింద పడి డిప్లొమా ఫైనల్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్, లెక్చరర్ కొట్టడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీ అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థులు ఎస్సైపై దాడికి దిగారు. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో అశోక్ అనే విద్యార్థి డిప్లొమా మూడవ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్ కొట్టడంతో మనస్థాపం చెందిన అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా సుమారు 1200 మంది విద్యార్థులు ఆందోళన చెప్పట్టారు. ప్రిన్సిపాల్, లెక్టరర్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అశోక్ సహచర విద్యార్థులు.

క్లాస్ జరుగుతున్న సమయంలో అసిఫియా అనే లెక్చరర్ అశోక్ ని లేపి ఒక ప్రశ్న వేశారు. అతడు సమాధానం చెప్పలేక పోవడంతో అసహనానికి గురైన లెక్చరర్ అశోక్ ని కొట్టడం జరిగింది. అశోక్ ని బయటకు లాక్కొచ్చి అందరి ముందు లెక్చరర్ తో పాటు ప్రిన్సిపాల్ కూడా చేయి చేసుకున్నారు. ఆ సమయంలోనే అశోక్ తన స్నేహితులతో అందరి ముందు ఆమె నన్ను కొట్టింది. నా పరువు పోయింది. నేనెలా బ్రతకాలి అని చెప్పినట్టు తెలుస్తోంది. 

అవమానంగా ఫీల్ అయిన అశోక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకొని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. స్థానికంగా ఉన్న ఎస్సై స్వామి మీరు ఆందోళన విరమించుకోకపోతే కేసులు పెడతామని విద్యార్థులను హెచ్చరించడంతో వారంతా కోపోద్రిక్తులయ్యారు. ఎస్సైపై దాడికి దిగారు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు కూడా విద్యార్థులకు మద్దతుగా అక్కడకు చేరుకున్నారు.