క్షణికావేశంలో సాఫ్ట్ వేర్ భార్య సూసైడ్

భార్య, భర్తల మధ్య నెలకొన్న చిన్న వివాదంతో సాఫ్ట్ వేర్ భార్య సూసైడ్ చేసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామానికి చెందిన బి.ఓబుల్‌రెడ్డి కుమార్తె స్రవంతి బీటెక్‌ చదివింది. 2013లో ఆమెకు మర్రిపాడు మండలం సింగన్నపల్లికి చెందిన ఆర్‌.వెంకటేశ్వర్లురెడ్డితో వివాహమైంది. వెంకటేశ్వర్లురెడ్డి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ లో  సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహానంతరం దంపతులిద్దరూ అమెరికాకు వెళ్లారు. అక్కడ దంపతులిద్దరు బాగానే ఉన్నారు. స్రవంతి జాబ్ చేస్తానన్న కూడా వెంకటేశ్వర్లు ఏం వద్దు హ్యపీగా ఉండమని చెప్పి ఆమెతో జాబ్ కూడా చేయించలేదు.

ఈ క్రమంలో 2016 జూలైలో స్రవంతి తన చెల్లెలు వివాహ నిశ్చితార్థం, వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చింది. అప్పటికే స్రవంతి గర్బంతో ఉండటంతో ప్రసవ నిమిత్తం అమ్మగారింటి దగ్గరే ఉంది. వెంకటేశ్వర్ ఒక్కడే అమెరికా వెళ్లిపోయాడు. వీరికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత వీసా సమస్యలు రావడంతో స్రవంతి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.

వీసా సమస్యల కారణంగా వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడుకు రాలేకపోయారు. ఐదు నెలల క్రితం ఆయన స్వగ్రామానికి వచ్చాడు. ఈ సారి అమెరికాకు కాకుండా ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకొంటూ దంపతులిద్దరూ నగరంలోని శ్రీహరినగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.  దీపావళి పండగ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ చిలకపాడుకు వెళ్లాలని దంపతులిద్దరూ నిర్ణయించుకొన్నారు.

 స్రవంతి తన తండ్రి ఓబుల్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఊరికి వస్తున్నామని చెప్పగా ఆయన బస్సులో రావాలని సూచించాడు. అయితే వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడు నుంచి తన ఊరికి బైక్‌పై వెళదామని చెప్పడంతో వారి మధ్య ఇంట్లో  వాగ్వాదం మొదలైంది. 

బస్సులోనే వెళదామని స్రవంతి పట్టుబట్టింది. వెంకటేశ్వర్లురెడ్డి ససేమిరా అన్నారు. అదే సమయంలో వారి కొడుకు రామ్‌శ్రావణ్‌రెడ్డి వస్తువులన్నీ కింద పడేస్తుండడంతో స్రవంతి అతనిని మందలించింది. దీంతో వెంకటేశ్వర్లు  వాడినెందుకు తిడుతావని స్రవంతిని తిట్టాడు.

ఊరికి వెళదాం రెడీ అయి ఉండు అని చెప్పి వెంకటేశ్వర్లు బయటికి వెళ్లాడు. భర్త తిట్టాడని మనస్తాపం చెందిన స్రవంతి భర్త బయటికి వెళ్లిన సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుంది.  ఈ విషయాన్ని గమనించిన భర్త స్థానికుల సహకారంతో ఆమెను కిందకు దించి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారణ కావడంతో బాలాజీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

 చిన్న విషయానికే గొడవపడి స్రవంతి చనిపోయిందని వెంకటేశ్వర్లు కూడా స్రవంతిని ఏ రోజు కూడా ఏం అనలేదని తమ విచారణలో తేలిందని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. క్షణికావేశంతో రెండు జీవితాలతో పాటు చిన్నారి జీవితం కూడా ఆగమయ్యిందంటూ పలువురు కంటతడి పెట్టారు.