నల్లగొండలో చదువుల తల్లిని రోడ్డు ప్రమాదంలో కబళించిన మృత్యువు

నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. ఆ ఇంటి చదువుల తల్లిని రోడ్డు ప్రమాద రూపంలో కబళింది. ఈ హృదయ విదారక ఘటన నల్లగొండలో జరిగింది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన సుర్వి భవాని 2017లో ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత గ్రూప్స్ కు స్వంతంగా ప్రిపేర్ అవుతూ పార్ట్ టైం పనులు చేసేది. వీరు ముగ్గురు కుమార్తెలు. భవాని అక్కలకు పెళ్లిళ్లు అయ్యాయి. భవాని ఉన్నతోద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకుంటాననడంతో తల్లిదండ్రులు కాదనలేకపోయారు. తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుని బతికేవారు. భవాని నల్లగొండలో ఫ్రెండ్స్ తో కలిసి రూంలో ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తోంది. ఓ వైపు పని చేస్తూనే మరో వైపు చదువుకునేది. 

ఆదివారం మధ్యాహ్నం పని నిమిత్తం భవాని తన స్కూటి పై బయటికి వెళ్లింది. ఇంతలోనే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసి బస్సు ఆమెను ఢికొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ భవానిని ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం భవాని మరణించింది. భవాని మరణంతో నల్లగొండలో విషాద చాయలు అలుముకున్నాయి. భవాని సంవత్సరం క్రితం ఓ కోచింగ్ సెంటర్ లో పని చేసింది. ప్రస్తుతం నల్లగొండలోని ఓ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తోంది. హాయిగా బతకాల్సిన అమ్మాయి అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఫ్రెండ్స్ శోక సంద్రంలో మునిగి పోయారు.

అందరితో కలివిడిగా ఉండే భవాని మరణంతో అంతా కన్నీరు పెట్టుకున్నారు. భవాని కుటుంబ సభ్యులను ఓదార్చ ఎవరి తరం కాలేదు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఆసరాగా ఉంటుందన్న బిడ్డ అకాల మరణంతో వారు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ప్రభుత్వం సాయం చేసి భవాని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే మరియు మిర్యాలగూడ ఎమ్మెల్యేలు స్పందించి భవాని కుటుంబానికి సహాయం అందించాలని స్నేహితులు, బంధువులు కోరుతున్నారు.