మరో మలుపు తిరిగిన SR నగర్ గ్యాంగ్ రేప్ కేసు (వీడియో)

ఎస్సార్ నగర్ సామూహిక అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు అసలు నిందితులని వదిలి ఏ పాపం తెలియని రాజ్ కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారని అత్యాచార బాధితురాలు వాపోయింది. తాను పెట్టిన కేసుకు కిరణ్ కు ఎటువంటి సంబందం లేదని ఆమె అన్నారు. పోలీసులు ఎందుకు ఇలా నాటకమాడుతున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. అసలు నిందితులను పట్టుకోని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎస్సార్ నగర్ కు చెందిన యువతికి సినిమాలలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఫ్రెండ్సే ఆమెకు కూల్ డ్రింక్స్ లో మత్తు మందు ఇచ్చి ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరికి మరో మహిళ శిరీష కూడా సహకరించిందని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసును పక్క దారి పట్టించేందుకు నిందితులు యత్నిస్తున్నారని, పోలీసులు  తన లాంటి అమ్మాయిలు స్టేషన్ కు వస్తే న్యాయం  చేయాల్సింది పోయి వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు.  ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు తనను వేధించారని ఆమె ఆరోపించింది.

తనలాంటి అమ్మాయిని మోసం చేయడమే కాకుండా నిందితులు ఏ భయం  లేకుండా స్వేచ్చగా తిరుగుతున్నారని ఆమె వాపోయారు. పోలీసులు  ఇలానే వారిని వదిలేస్తే వారు ఏ తప్పు చేయడానికైనా వెనకాడరని  తనకు ప్రాణ భయం  ఉందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు  శిరీష వల్లే కేసును పట్టించుకోవడం లేదని తెలంగాణలో ఆడపిల్లకు న్యాయం జరగదా అని ప్రశ్నించారు.

తనకు నరకం చూపిన  ఆ నలుగురిని వదిలేది  లేదని ఆమె హెచ్చరించారు. వాళ్లను శిక్షించే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో హైదరాబాద్  కమీషనర్ న్యాయం చేస్తానని హామీనిచ్చారని, లోకల్ పోలీసులు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అసలు  నిందితులను ఎందుకు వదిలేస్తున్నారో చెప్పాలని ఆమె పోలీసులను ప్రశ్నించారు.