ఐదుగురు ఉపాధ్యాయులను కాపాడిన మంత్రి జోగు రామన్న(వీడియో)

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రమంతా వరదమయంగా మారింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరుకొని ప్రయాణాలు ప్రమాదంగా మారాయి. ఈ నేపథ్యంలో గురువారం వరదలో చిక్కుకున్న ఐదుగురి ప్రాణాలను కాపాడారు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న.

మావల మండలం, వాగపూరు గ్రామ ఉపాధ్యాయులు రమేష్, ప్రతాప్, చంద్రశేఖర్, ప్రవీణ్ కుమార్, సుజాతలు కారులో పాఠశాలకు వెళుతున్నారు. వైజాపూర్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటి వాగులో చిక్కుకున్నారు. ఈ విషయం జోగు రామన్నకు తెలియటంతో ఆయన హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. తనతో పాటే సహాయక చర్యల కోసం ఫైర్ ఇంజన్ ని కూడా తీసుకువెళ్లారు రామన్న.

సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది ఐదుగురిని క్షేమంగా బయటకు చేరవేశారు. అయితే వారు ప్రయాణించిన కారు మాత్రం కొట్టుకుపోయింది. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలియగానే ఘటన స్థలికి చేరుకొని వారి ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి చర్యలు చేపట్టిన మంత్రి జోగు రామన్నపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

కింద ఉన్న వీడియోలో సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు మీరు కూడా చూడవచ్చును.

ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా నీరు చేరడంతో సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేశారు అధికారులు.