వీడియో: హృద‌యానికి హ‌త్తుకునే నాగోబా జాత‌ర‌

నాగోబా జాత‌ర‌. అతి ప్రాచీన గిరిజ‌నుల సంప్ర‌దాయ పండుగ‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ జాత‌ర పేరు విన‌ని వారుండ‌రు. స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర త‌ర‌హాలోనే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునే ఆదివాసీల ఉత్స‌వం ఇది. అడ‌వుల ఖిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో జ‌రిగే ఈ పండుగ వ‌చ్చేనెల 4వ తేదీన ఆరంభం కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఇంద్ర‌వెల్లి మండ‌లం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయానికి ముస్తాబు చేశారు. నాగోబా జాత‌ర‌ను తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించింది. నాగుల‌ను పూజించ‌డం ఈ జాత‌ర‌ ప్ర‌త్యేక‌త‌.

పుష్య‌మాసం అమావాస్య నాడు ఆరంభ‌మ‌య్యే నాగోబా జాత‌ర నాలుగు రోజుల పాటు కొన‌సాగుతుంది. మేస్త్రం వంశీయులు మాత్ర‌మే ఈ జాత‌ర‌ను నిర్వ‌హిస్తారు. 400 మంది గిరిజ‌న జ‌నాభా ఉండే కేస్లాపూర్ ఈ జాత‌ర సంద‌ర్భంగా స‌రికొత్త క‌ళ‌ను సంత‌రించుకుంటుంది. లక్ష‌లాది మంది భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో బుధ‌వారం సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. క‌ర్టెయిన్ రైజ‌ర్‌గా విడుద‌ల చేసిన ఈ వీడియోను ఎల్ల‌నార్ ఫిల్మ్స్ రూపొందించింది. టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.