ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం

ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లి బాజాలు ఇంక ఆగనే లేదు. బంధువుల మురిపెం, ముచ్చట ఇంక ఒడవనే లేదు. కొత్త దంపతుల ముసిముసి నవ్వులు ఇంకా విరియనే లేదు. పెళ్లై 24 గంటలు గడవక ముందే ఆ నవ దంపతులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్డు ప్రమాదం వారి పాలిట శాపమైంది. నలుగురు బంధువుల పరిస్థితి విషమంగా ఉంది.

ఆదిలాబాద్ జిల్లా మావల మండలం రాంనగర్ లో నివాసం ఉంటున్న మెట్ పల్లి ముత్తమ్మ, అశోక్ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయికుమార్ తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సాయికుమార్ ఇంటి వద్ద జరిగింది. శుక్రవారం మావలలో వివాహ రిసెప్షన్ ఉంది.  రిసెప్షన్ కోసం పెళ్లి కుమారుని ఇంటి వద్ద నుంచి నవదంపతులతో పాటు బంధువులు వడ్డెడ్ నుంచి ఆదిలాబాద్ కు కారులో బయల్దేరారు.

కారు ను పెళ్లి కొడుకు సాయి నడుపుతున్నాడు. కారు దేవాపూర్ ఫారెస్ట్ చెక్ పోస్టు వద్ద ఆదిలాబాద్ నుంచి బరంపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసి బస్సు టర్న్ అవుతోంది. అదే సమయంలో వీరి కారు అదుపు తప్పి బస్సు ను ఢికొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి కొడుకు సాయి, ఆయన మేనత్త రాజమణిల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగగానే అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేసి గాయపడ్డవారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిలిచిపోయిన రిసెప్షన్

పెళ్లి కూతురు ఇంటివద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పటి దాక వారంతా ఏర్పాట్లలో బిజిగా ఉన్నారు. వంటలు సైతం పూర్తి చేశారు. కానీ ప్రమాదం తెలియగానే అంతా విషాదంలో మునిగిపోయి రిమ్స్ చేరుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ బోసిపోయింది. అంతా ఆసుపత్రికి చేరుకొని రోధించారు. ఈ ఘటన అందరిని కలిచి వేసింది. పెళ్లి బాజాల సప్పుడు ఆగక ముందే కన్నీరు పెట్టించావా దేవుడా అంటూ వారు రోధించిన తీరు అందరిని కలిచి వేసింది.