ఆసుపత్రిలో బిడ్డను చూశాక… ప్రియురాలికి తాళికట్టి

ప్రేమను పేగు బంధం కలిపింది. పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు పుట్టిన బిడ్డను చూసి పులకించి పోయాడు. పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పి చివరకు బిడ్డను చూసి ప్రేమతో ప్రేమించిన అమ్మాయి మెడలో హాస్పిటల్ లోనే తాళి కట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే…

తమిళనాడులోని వేలూరుకి చెందిన రాజ్యలక్ష్మీ, హరి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ బంధం శారీరక సంబంధానికి దారితీసింది. రాజ్యలక్ష్మీ గర్భవతి అయింది. తనను పెళ్లి చేసుకోవాలని రాజ్యలక్ష్మీ కోరగా ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నాడు. దీంతో రాజ్యలక్ష్మీ తీవ్ర మానసిక వేదనకు గురైంది.

రాజ్యలక్ష్మీకి నెలలు నిండడంతో శుక్రవారం నాడు వాలాజపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హరి ఆసుపత్రికి వెళ్లి తన బిడ్డను చూశాడు. శుక్రవారం నాడు మహాలక్ష్మీ పుట్టిందని సంబర పడ్డాడు. వెంటనే తన మనసును మార్చుకొని ఆసుపత్రిలోనే కొంత మంది బంధువులు, ఆసుపత్రి  సిబ్బంది సమక్షంలో రాజ్యలక్ష్మీ మెడలో హరి తాళి కట్టాడు. ఆలస్యంగానైనా తన తప్పు తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకున్నావని హరిని పలువురు అభినందించారు.