తిరుమలలో పోలీసులకు చుక్కలు చూపెట్టిన కృష్ణా జిల్లా యువతి

అనునిత్యం ఎందరో భక్తులు తిరుపతి నుండి కాలి నడక బాటన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అయ్యాక కూడా కొందరు భక్తులు కాలిబాటనే తిరుపతికి వస్తారు. ప్రశాంతంగా సాగిపోయే ఆ కాలిబాటన ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు పోలీసులకు ఆమె పంపిన సెల్ఫీ పోస్టు ఆమెను ప్రాణాలతో కాపాడింది.

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో మొదటి ఘాట్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా, జగ్గయ్య పేటకు చెందిన నీరజ అనే యువతి మోకాళ్ళ మెట్టు సమీపంలోని అవ్వాచారి కోనలోకి దూకేసింది. అయితే ఆమె సూసైడ్ ప్రయత్నం చేయడానికి ముందే సెల్ఫీ తీసుకుంది. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు సెల్ఫీ ఫోటో జత చేస్తూ పోలీసులకు వాట్సాప్ లో పోస్ట్ చేసింది.

ఆ పోస్టు చూసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ యువతి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది అవ్వాచారికోనలో గాలింపు మొదలు పెట్టారు. నీరజ 60 అడుగుల లోతులో స్వల్ప గాయాలతో కనిపించింది. తిప్పలు పది ఆమెను ప్రాణాలతో బయటకి తీసుకొచ్చారు పోలీసులు, ఫైర్ సిబ్బంది.

మొదట ఆమెను తిరుమలలోని అశ్విని హాస్పిటల్ కి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ కు తరలించారు. ప్రస్తుతం నీరజ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువతిని కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటకు చెందిన నీరజగా గుర్తించిన పొలీసులు, కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి లోయలో దూకేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.

తిరుమల పొలీసులు జగ్గయ్యపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా…రెండు రోజుల క్రితమే ఆమె పేరు మీద జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు వారు తెలిపారు. జగ్గయ్యపేటకు చెందిన నీరజకు మూడేళ్ళ క్రితం వివాహమయ్యింది. భర్తతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్న నీరజ మూడు రోజుల క్రితం నుండి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.