బ్రేకింగ్ న్యూస్.. గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు భీభత్సం

హైదరాబాద్ గచ్చిబౌలిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కోఠి నుంచి లింగంపల్లికి వెళ్తున్న హెచ్ సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గచ్చిబౌలి చౌరస్తాలోని బస్టాండ్ లో వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్టాప్ లో నిలబడిన ముగ్గురు వ్యక్తులకు బస్సు బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడే ప్రాణాలు వదిలారు. బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద స్థలంలో విగత జీవులుగా మృతులు

మృతుల్లో కూలీ పనిచేసుకునేవారు, ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పొద్దుగాలనే పనికి వెళుదామని బయలుదేరిన వారికి అదే చివరి ఉదయం అయ్యింది. ఏ తప్పు లేకుండా అన్యాయంగా అర్ధాంతరంగా అసువులు బాసటంతో అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణ సురక్షితం అని చెప్పే మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు కండీషన్ చూసుకోకుండానే రోడ్ల మీదకు వస్తున్నారని విమర్శించారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల పట్ల వ్యవహరించే తీరును కూడా పలువురు విమర్శిస్తున్నారు.