హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగిని చంపిన భార్య, ఎందుకో తెలుసా

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వమున్నవాడు అనే పాట ద్వారా కనుమరుగవుతున్న మానవ సంబంధాలపై కవి అందెశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలయ్యాయి. మనిషిని ప్రేమించడం ఈ సమాజం ఏనాడో మరిచింది. డబ్బుకు విలువిచ్చి మానవ సంబంధాలను మంట కలుపుతున్నారు. అలాంటి దారుణ సంఘటనే హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. అత్యాషకు పోయిన ఓ ఇల్లాలు భర్తను కడతేర్చింది. చివరకు కటకటాలపాలయ్యింది.

వనస్థలిపురానికి చెందిన కేస్యనాయక్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పద్మ. భర్తను చంపితే ఇన్సూరెన్స్ డబ్బుతో పాటు ఉద్యోగం వస్తుందని కేస్య నాయక్ ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. వినోద్ అనే వ్యక్తితో జతకట్టి తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. కారులో భర్తకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తను తప్పించుకోవడం కోసం ఓ కట్టుకథను అల్లింది.

తన భర్త గుర్రంగూడ దగ్గర స్తంభానికి కారు ఢీకొని చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంతే కాకుండా పోలీసులను సైతం బురిడీ కొట్టించి వారికి తప్పుడు ఫిర్యాదు చేసింది. పద్మ చెప్పిన విధానంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను  విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో పద్మ, వినోద్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.