కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని దారుణమైన దాడి

ప్రేమ పెళ్లిళ్ల చుట్టూ ఇటీవల కాలంలో తీవ్రమైన వివాదాలు రేగుతున్నాయి. మొన్నటికి మొన్న అమృత ప్రణయ్, నిన్నటికి నిన్న హైదరాబాద్ లో మాధవి, సందీప్ ల ప్రేమ పెళ్లి చుట్టూ వివాదాలు చెలరేగాయి. మిర్యాలగూడ కేసులో ప్రణయ్ ని అమృత తండ్రి కిరాయి హంతకుల చేత మట్టు పెట్టించారు. హైదరాబాద్ లో మనోహరాచారి తన కూతురు, అల్లుడి మీద దాడి చేసి గాయపరిచారు.

తాజాగా రాజకీయ నేత, సిపిఐ జిల్లా కార్యదర్శి అయిన కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తన అన్న కూతురు మంగళి యువకుడిని ప్రేమించిందని కోపంతో ఆ యువకుడిపై దాడికి దిగాడు. తాను కమ్యూనిస్టు లీడర్ ను అన్న విషయం కూడా మరచిపోయి ఆ యుకువడిని మర్మాంగాల మీద దాడి చేసి గాయపరిచారు. దాడికి గురైన యువకుడి పేరు సాయి సందీప్, ఈయనది ఇందుర్తి గ్రామం, చిగురు మామిడి మండలం, కరీంనగర్ జిల్లా. 

దీనికి సంబంధించి కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి బూరం అభినవ్ వెల్లడించిన సమాచారం కింద ఉంది చదవండి. (తెలంగాణ సీనియర్ జర్నలిస్టు ఎం.వి. రమణ ఫేస్ బుక్ వాల్ నుంచి తీసుకున్న పోస్టు యదాతదం…) 

 

సాయి కిరణ్

సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి అయిన కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తన అన్న కూతురు మంగలి యువకునితో పెళ్లికి సిద్ధపడితే… కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్నే మరచిపోయి మనువాదాన్ని అమలుచేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కరీంనగర్ నాయకుడు. 

బైక్ మీద వెళుతున్న యువకుణ్ణి రన్నింగ్ లోనే కింద పడేసి , కొట్టుకుంటూ ఇంటికి ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశారు. కుటుంబమంతా కలిసి చెప్పులు, రబ్బర్ బెల్ట్, కర్రలతో చావబాదారు. కంటిపై, మూతిపై చివరికి మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచారు.స్పృహ తప్పేదాక కొట్టారు.వీధిలో ప్రజలు పోలీసులకు సమాచారమిస్తే యువకుణ్ణి పొదల్లో విసిరేశారు. 

తొమ్మిదో తరగతిలో మొదలైన స్నేహం ఇంటర్ లో ప్రేమగా స్థిరపడింది. డిగ్రీ దాకా కొనసాగిన ప్రేమ పెళ్లికి దారి తీసింది.ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటూ అమ్మాయి నేరుగా అబ్బాయి ఇంటికే వచ్చింది. అబ్బాయి తల్లి భయపడింది.అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది.తండ్రి లేని కొడుకును రెడ్లు కొట్టి చంపుతారని భయపడింది.కొడుకుకు నచ్చజెప్పింది.అమ్మాయిని జాగ్రత్తగా అబ్బాయే ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు.అమ్మాయి గృహ నిర్బంధానికి గురయింది.పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

దాడిలో గాయపడిన సాయి కిరణ్

40 రోజుల తర్వాత అనుకోకుండా కలుసుకున్న ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసికోవాలనుకున్నారు. అబ్బాయి కుటుంబం దాడులకు భయపడి పెళ్లిని నిరాకరిస్తే.. అమ్మాయి కుటుంబం మాత్రం కులం తక్కువ మంగలోడని నిరాకరించింది.ఇద్దరు వ్యతిరేకించడంతో ప్రేమికులు దూరంగా వెళ్లిపోవాలనుకున్నారు.విషయాన్ని పసిగట్టిన అమ్మాయి కుటుంబం అబ్బాయిని పట్టుకొని దారుణంగా దాడి చేశారు.ఒక రకంగా చూస్తే చంపాలనుకున్నారు. వీధిలో ప్రజలు చూడడం వల్ల ప్రాణాలు తియ్యలేకపోయారు.

 శ్రామిక వర్గ పోరాటాలు చేసే సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి అగ్రకులోన్మాదం తో దాడిచేసి తన అగ్రకుల మనువాదాన్ని చాటుకున్నాడు.

కమ్మునిస్ట్ నాయకుని తమ్ముడు జైపాల్ రెడ్డి గ్రామ సర్పంచ్ , డ్రైవర్ లుకూడా దాడిలో భాగం అయ్యారు.

కమ్మునిస్ట్ నాయకుని భార్య మంగలి యువకుణ్ణి చెప్పుతో కొట్టి భర్తకు తగ్గ భార్యగా గుర్తింపుకోసం ప్రాకులాడింది.మహిళలందరూ ఒక్కటి కాదనీ..

కమ్మునిజం కాదు మాది కూడా మనువాద పితృస్వామ్యమేనని నిరూపించింది. 

పోలీసులు మాత్రం అమ్మాయిని అగ్రకులాలకే వదిలేసి… బాధితుడి మీద కూడా కేసు పెట్టారు.

పీడిత ప్రజల పార్టీ సిపిఐ మాత్రం ఇంకా స్పందించలేదు.

ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నడిగొట్టి సాయి కిరణ్ కుటుంబం భయం భయంగా బ్రతుకుతున్నారు.

ప్రేమించిన యువకునితో పెళ్లికి సిద్ధ పడ్డ యువతిని కుటుంబం అక్రమంగా నిర్బంధించింది.

గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికిరణ్ కు పరామర్శ

డిమాండ్స్ : 

1.సాయికిరణ్ పై దాడి చేసిన కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి.

2.ప్రేమికులకు వెంటనే పెళ్లి చేసి రక్షణ కల్పించాలి.

3. సిపిఐ పార్టీ వెంటనే స్పందించి రాంగోపాల్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించాలి.

4.ప్రేమికులకు కులాంతర వివాహాన్ని చేసే బాధ్యతను CPI పార్టీ తీసుకోవాలి.

మంగలి సాయికిరణ్ పై అగ్రకులోన్మాద దాడికి వ్యతిరేకంగా బలమైన పోరాటాన్ని నిర్మించి న్యాయం.కోసం పోరాడాలి.

బీసీ ఉద్యమ సంస్థలు, మేధావులు, దళిత,ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, మహిళ సంఘాలు వెంటనే స్పందించాలి. ప్రేమికులకు అంశంగా నిలబడాలి.

బూరం అభినవ్
కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS)

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ.