యువతికి నమ్మిన స్నేహితుడు అతడు. యువతితో ఉన్న పరిచయంతో ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్లాడు. వారి ఆస్తి పాస్తులు చూసిన తర్వాత స్నేహితునికి ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. స్నేహితురాలిని బ్లాక్ మొయిల్ చేస్తే కోట్ల రూపాయల ఆస్తి సొంతం చేసుకోవచ్చని ఆలోచించాడు. తాను వేసిన పథకాన్ని అమలు పరిచాడు. కానీ చివరకు సినీ ఫక్కీలో దొరికి కటకటాలపాలయ్యాడు. ఇద్దరు ఎస్ ఐలు అచ్చం సినిమాలో చూపినట్లుగానే వ్యవహరించి ప్లాన్ వర్కవుట్ చేశారు. ఇంతకీ ఏమీటా పథకం.. ఏంటా స్టోరీనో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
హిమాయత్ నగర్ లో నివాసముండే రక్ష అగర్వాల్ ఈవెంట్ అకాడమీలో చదివింది. ఆ సమయంలోనే అకాడమిలో వినీత్ పరిచయమయ్యాడు. అక్కడ వారి ట్రైనింగ్ అయిపోయాక వినీత్ జూబ్లీహిల్స్ లో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. రక్షతో ఉన్న పరిచయంతో వినీత్ ఆమెతో క్లోజ్ గా ఉండేవాడు. ఈవెంట్ విషయాలలో కూడా ఒకరికొకరు సహకరించుకునేవారు. రక్ష ఆస్తులు చూశాక వినీత్ రక్షను బ్లాక్ మొయిల్ చేసి బెదిరించి డబ్బు తీసుకోవాలని పథకం వేశాడు. ఆమె ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పెట్టాలని ప్లాన్ వేశాడు. స్నేహితుల సహాయంతో రక్ష ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చేశాడు. వాటిని రక్షకు వాట్సాప్ లో పంపించి రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. భయపడిన రక్ష విషయాన్ని తండ్రికి చెప్పింది.
కూతురు పరువు పోతుందని భావించిన తండ్రి అప్పో సప్పో చేసి పైసలు సర్దుతుండగా ఆయన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. దీంతో ఫిర్యాదు అందగానే సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి నిందితులను పట్టుకునేందుకు ఒక పథకం వేశాడు. వినీత్ అతడి స్నేహితుల సెల్ ఫోన్లను ట్రాకింగ్ లో ఉంచారు. రూ. 20 లక్షలు ఇస్తామంటూ రక్షతో వినీత్ కు ఫోన్ చేయించారు. రక్ష నగదుతో వినీత్ చెప్పిన ప్రాంతానికి బయలు దేరగా అదే కారు డిక్కిలో ఎస్సై మదన్, వెనుక మారు వేషంలో మరో ఎస్సై మహిపాల్ అనుసరించారు.
పోలీసులు వస్తారని పసిగట్టిన వినీత్ డబ్బును తీసుకునేందుకు స్నేహితులను పంపిస్తున్నానని కొంపల్లి వద్దకు రావాలని రక్ష తండ్రికి చెప్పాడు. రక్ష తండ్రి కొంపల్లికి వెళ్లగా అక్కడ కాదు నిర్మానుష్య ప్రాంతానికి రావాలంటూ చెప్పాడు. అక్కడికి రక్ష తండ్రి వెళ్లగానే బైక్ పై మహేష్, గణేష్ వచ్చారు. వారికి రక్ష తండ్రి డబ్బు సంచి ఇస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఎస్సైలు మదన్, మహిపాల్ లు వచ్చి గణేష్, మహేష్ లను అదుపులోకి తీసుకున్నారు.
వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గణేష్ చేత వినీత్ కు ఫోన్ చేయించారు. వినీత్ ను అదుపులోకి తీసుకునేందుకు గణేష్, మహేష్ లను బైక్ పై తీసుకెళ్లారు. పోలీసులు అనుమానిస్తున్నారని గ్రహించిన వినీత్ వారిని పలు ప్రాంతాలకు తిప్పాడు. చివరికి నిజామాబాద్ హైవేపైకి రమ్మన్నాడు. గణేష్ బైక్ నడుపుతుండగా ఎస్సై మదన్ హెల్మెట్ పెట్టుకొని వెనుకు కూర్చున్నాడు. వినీత్ బైక్ పై హైవేపైకి వచ్చి గణేష్ నుంచి నగదు తీసుకునేందుకు బండిని స్లో చేశాడు. వెంటనే ఎస్సై మదన్ కిందకు దూకి వినీత్ బైక్ ను పట్టుకున్నాడు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. సినీ ఫక్కీలో కేసు ఛేదించి నిందితులను పట్టుకున్న పోలీసులను పలువురు అభినందించారు.